KCR CBI : సీబీఐపై కీలక నిర్ణయం తీసుకోనున్న సీఎం కేసీఆర్..

KCR CBI : తెలంగాణలో సీబీఐ అడుగుపెట్టాలంటే.. ఇకపై అనుమతి తీసుకోవాల్సిందే. సీబీఐకి రాష్ట్రంలో అడుగుపెట్టకుండా త్వరలోనే నిర్ణయం తీసుకునే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారు. ఏ రాష్ట్రంలోనైనా సీబీఐ అధికారులు దాడులు చేయాలన్నా, దర్యాప్తు చేయాలన్నా ఆ రాష్ట్ర అనుమతి తప్పనిసరి. ఇందుకోసం అన్ని రాష్ట్రాలు జనరల్ కన్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ సర్కార్ కక్షసాధింపులకు ఉపయోగించుకుంటోందని ఆరోపిస్తున్న సీఎం కేసీఆర్.. సీబీఐకి కన్సెంట్ ఇవ్వొద్దంటూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు బిహార్ వేదికగా పిలుపునిచ్చారు.
రాష్ట్రాలపై కేంద్రం దాడులు ఆగాలంటే సీబీఐకి ఇచ్చిన సమ్మతిని అన్ని రాష్ట్రాలు ఉపసంహరించుకోవాలని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోనూ సీబీఐని అడ్డుకొనే దిశగా పావులు కదుపుతున్నారు. త్వరలోనే కన్సెంట్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చే ఆలోచనలో ఉన్నారు సీఎం కేసీఆర్.
నిజానికి సీబీఐని ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేశారు. ఢిల్లీలో మినహా ఏ రాష్ట్రంలో సీబీఐ తన అధికారాల్ని వినియోగించుకోవాలన్నా.. ఆయా రాష్ట్రాల సాధారణ సమ్మతి అవసరం. ఇందుకోసం రాష్ట్రాలు ఎప్పటికప్పుడు కన్సెంట్ నోటిఫికేషన్‌లు ఇస్తుంటాయి. రాష్ట్రం కన్సెంట్ ఇచ్చిందంటే.. ఇక ఆ రాష్ట్రంలో ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా సీబీఐ తనిఖీలు, దర్యాప్తులు చేయవచ్చు.
ఒకవేళ రాష్ట్రాలు సాధారణ సమ్మతి ఇవ్వకపోతే గనక.. ఢిల్లీలో తప్ప దేశంలోని ఏ రాష్ట్రంలోనూ సీబీఐ నేరుగా వెళ్లి దర్యాప్తు చేసేందుకు వీలులేదు. ప్రస్తుతం బీజేపీయేతర రాష్ట్రాలు సీబీఐకి కన్సెంట్ ఇవ్వడం లేదు. చాలా రాష్ట్రాలు కన్సెంట్‌ను ఉపసంహరించుకుంటున్నాయి కూడా. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తోంది.
సీబీఐకి జనరల్ కన్సెంట్ ఇవ్వని రాష్ట్రాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం బీజేపీయేతర రాష్ట్రాలన్నీ కన్సెంట్‌ను రద్దు చేసుకున్నాయి. 2018లో చంద్రబాబు ప్రభుత్వం కూడా ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చినపుడు సీబీఐకు ఇచ్చిన సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంది. అయితే, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత జనరల్ కన్సెంట్‌ను పునరుద్ధరించారు. పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, పంజాబ్, మేఘాలయ, కేరళ, మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాలు సైతం సీబీఐ ప్రవేశించకుండా సాధారణ సమ్మతి ఉత్తర్వుల్ని ఉపసంహరించుకున్నాయి.
కొద్ది రోజులుగా తెలంగాణలో కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడు పెరిగింది. ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయి. మరోవైపు కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం అంటూ తెలంగాణ బీజేపీ నేతలు కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీబీఐకి కన్సెంట్‌ను ఉపసంహరించుకోవాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. పశ్చిమ బెంగాల్, బిహార్ ప్రభుత్వాలు చేసినట్టుగానే.. తెలంగాణలోనూ సీబీఐకి నో ఎంట్రీ చెప్పేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దీనిపై న్యాయ నిపుణులు, అధికారులతో ప్రభుత్వం చర్చించినట్లు తెలిసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com