KCR Review : ఒక్క గజం అటవీ జాగానూ అన్యాక్రాంతం కానివ్వం : కేసీఆర్

cm kcr tv5
KCR Review : తెలంగాణలో పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు ఈనెల మూడోవారం నుంచి కార్యాచరణ ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పోడు భూముల వ్యవహారం కొలిక్కి వచ్చిన తరువాత ఒక్క గజం జాగా అటవీ భూమి భవిష్యత్తులో అన్యాక్రాంతం కావడానికి వీల్లేదన్నారు.. దురాక్రమణలు అడ్డుకోవడానికి కావాల్సిన అన్ని రక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. అడవులను రక్షించుకునేందుకు ప్రభుత్వం ఎటువంటి కఠిన చర్యలకైనా వెనకాడబోదన్నారు. పోడు సమస్యను పరిష్కరించే క్రమంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి అవసరమైతే నేతలకు అటవీ భూములు అన్యాక్రాంతమైన విధానాన్ని ప్రత్యక్షంగా చూపిస్తామన్నారు. అటవీ పరిరక్షణ కమిటీలను నియమించేందుకు విధి విధానాలను తయారు చేయాలని అధికారులను సీఎం అదేశించారు.
పోడు భూముల అంశంపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది.. అసెంబ్లీలో ఇచ్చిన మాట ప్రకారం పోడు భూముల సమస్యల పరిష్కారానికి అక్టోబర్ మూడో వారం నుంచి కార్యాచరణ ప్రారంభించాలని అధికారులకు సూచించారు. అక్టోబర్ మూడో వారంలో రాష్ట్రవ్యాప్తంగా పోడు భూములకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించాలన్నారు. దరఖాస్తుల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా వారి వ్యవసాయ భూమి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్థారించేలా చర్యలు చేపట్టాలన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించి వారికి తగిన ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఎమ్మెల్యేల సూచనలు సలహాలు తీసుకోవాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖ సమన్వయంతో అటవీ శాఖ అధికారులు అటవీ భూముల రక్షణలో కీలకంగా పనిచేయాలన్నారు.
నవంబర్ నుంచి అటవీ భూముల సర్వేను ప్రారంభించనున్నట్టు సీఎం తెలిపారు. కోఆర్డినేట్స్ ద్వారా ప్రభుత్వ అటవీభూముల సరిహద్దులను గుర్తించాలన్నారు. అవసరమైన మేరకు కందకాలు తొవ్వడం, ఫెన్సింగ్ తదితర పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను సిఎం ఆదేశించారు. కావాల్సిన బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుందన్నారు. పకడ్బందీ చర్యల కోసం అవసరమైతే పోలీస్ ప్రొటెక్షన్ అందిస్తామని తెలిపారు. అంతిమంగా అందరి లక్ష్యం ఆక్రమణలకు గురికాకుండా అడవులను పరిరక్షించుకునేదై వుండాలని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. అడవుల నడిమధ్యలో సాగుతున్న పోడు వ్యవసాయాన్ని తరలించి, అటవి అంచున భూమిని కేటాయిస్తామన్నారు. అట్లా తరలించిన వారికి సర్టిఫికెట్లు ఇచ్చి, వ్యవసాయానికి నీటి సౌకర్యం, కరెంటు వంటి వసతులు కల్పించి, రైతుబంధు రైతుబీమాను కూడా వర్తింపచేస్తామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com