శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం:సీఎం కేసీఆర్

శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్ లో జరిగిన రాష్ట్ర పోలీసు శాఖ, అటవీశాఖ ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం పలు సూచనలు చేశారు. హైదరాబాద్ లో పది లక్షల సిసి కెమెరాల ఏర్పాటు లక్ష్యంగా కార్యాచరణ వేగవంతం చేయాలని డిజిపికి సిఎం సూచించారు. పోలీసు వ్యవస్థలో ఐటీ పాత్రను పెంచి నేరాలను అరికట్టడంలొ సాంకేతిక వ్యవస్థలను ఉపయోగించుకోవాలన్నారు. దేశానికే తలమానికంగా హైదరాబాద్ లో నిర్మితమౌతున్న పోలీసు కమాండ్ కంట్రోల్ వ్యవస్థ నిర్మాణాన్ని అతి త్వరలో పూర్తిచేసి వినియోగంలోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం మహిళల భధ్రతను ప్రాధాన్యతాంశంగా తీసుకుని పనిచేస్తోందని.. మహిళా సంరక్షణ కోసం మరింతగా శ్రమించాల్సిన అవసరముందన్నారు. సమాజాన్ని పీడించే గంజాయి వంటి వాటి ఉత్పత్తి, అమ్మకం, రవాణా వ్యవస్థలను పూర్తిగా అరికట్టాలన్నారు. అటవీ సంపదను కొల్లగొట్టే వారిపట్ల మరింత కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. తెలంగాణను గుడుంబా రహిత రాష్ట్రంగా మార్చిన ఎక్సైజు, సివిల్ పోలీసులు తిరిగి అదే స్ఫూర్తితో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశవ్యాప్తంగా దళితుల మీద దాడులు జరుగుతున్న వార్తలు వినడం శోచనీయమని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితి నుంచి సమాజం దూరం కావాలని ఈ సందర్భంగా సీఎం ఆకాంక్షించారు.
నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారాల మీద పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించి అరికట్టాలని సీఎం చెప్పారు. కష్టపడి సాధించాల్సిన పట్టాలను తప్పుడుదారుల్లో పొందే సంస్కృతి సమాజానికి తప్పుడు సంకేతాలిస్తుందని తెలిపారు. ఫేక్ సర్టిఫికెట్లను సృష్టించే ముఠాలు, వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు సిఎం కెసిఆర్ సూచించారు. పోలీసు శాఖలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్ సెటిల్ చేసి, సర్వీసు ఆఖరి రోజున గౌరవప్రదంగా ఇంటిదాకా సాగనంపాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి మరోమారు పోలీసు ఉన్నతాధికారులకు గుర్తుచేశారు. డ్యూటీలో వుంటూ చనిపోయిన ఉద్యోగి వారసులకు, నిబంధనల ప్రకారం కారుణ్య నియామకానికి అర్హత కలిగిన వారసులకు, తక్షణమే ఉద్యోగం ఇవ్వాలని, దీనిపై తక్షణ కార్యాచరణ చేపట్టాలన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com