KCR : క్లౌడ్ బరస్ట్ కుట్రలు చేస్తున్నారు : కేసీఆర్

KCR : క్లౌడ్ బరస్ట్ కుట్రలు చేస్తున్నారు : కేసీఆర్
KCR : భద్రాచలంకు వెయ్యి కోట్ల రూపాయలతో వరద ముప్పు తప్పిస్తామన్నారు సీఎం కేసీఆర్.

KCR : భద్రాచలంకు వెయ్యి కోట్ల రూపాయలతో వరద ముప్పు తప్పిస్తామన్నారు సీఎం కేసీఆర్. ఐటీడీఏ ఆఫీసులో అధికారులు, మంత్రులతో సమీక్షా నిర్వహించారు. వరద పరిస్థితులు, నష్టం తదితర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. భద్రాచలం ముంపు బాధితులకు శాశ్వత కాలనీలు నిర్మిస్తామని చెప్పారు. ఇందుకోసం ఎత్తైన ప్రదేశాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.

వరద బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా పది వేల రూపాయలు అందిస్తామని చెప్పారు. భద్రాచలం కాంటూర్ తీయించి..వరద ముప్పు తగ్గించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇందుకోసం ఐఐటీ, CWC అధికారులతో పాటు నిపుణులైన అధికారులను పంపిస్తామన్నారు. మరోసారి భద్రాచలంలో పర్యటిస్తానని..ఆలయం అభివృద్ధిపై చర్చిస్తానన్నారు.

మరోవైపు భారీ వర్షాలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో క్లౌడ్‌ బరస్ట్‌కు కుట్రలు జరుగుతున్నాయన్న వార్తలు వస్తున్నాయన్నారు. గతంలో జమ్ము కశ్మీర్‌ లద్ధాఖ్‌లో ఇలా చేశారన్న ప్రచారం ఉందన్నారు. ఈ నెల 29 వరకు వర్షాలు ఉన్నాయని చెప్పారు సీఎం కేసీఆర్‌. అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కడెం ప్రాజెక్టుకు చరిత్రలో ఎన్నడూ లేనంతగా వరదలు వచ్చాయన్నారు. దేవుని దయ వల్ల కడెం ప్రాజెక్టు నిలబడిందన్నారు.

అంతకుముందు భద్రాచలం చేరుకున్న కేసీఆర్ బ్రిడ్జి దగ్గర గోదావరికి శాంతి పూజలు చేశారు. గోదావరి పరిసరాలను, కరకట్టను పరిశీలించారు. తర్వాత భద్రాచలం పునరావాస కేంద్రంలో బాధితులతో మాట్లాడారు. వరద బాధితులకు అందుతున్న సహాయ చర్యలపై ఆరా తీశారు.

Tags

Read MoreRead Less
Next Story