KCR: యశ్వంత్ సిన్హాకు మద్దతుగా మోదీపై విమర్శలు చేసిన కేసీఆర్..

KCR: ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విపక్షాల రాష్ట్రపత్రి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా జరిగిన సభలో మోదీ పాలనపై ఆరోపణలు, ప్రశ్నలు, విమర్శనస్త్రాలు సంధించారు. మోదీ ఇచ్చిన హమీల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదన్నారు. టార్చిలైట్ వేసి వెతికినా మోదీ హామీలు నెరవేర్చినట్లు కనిపించవని ఎద్దేవా చేశారు.
రైతులు, నిరుద్యోగులు, సైనికులు సహా అన్ని వర్గాల ప్రజలను మోదీ మోసం చేశారని ఆరోపించారు. సాగు చట్టాల తెచ్చి రైతులను ఇబ్బంది పెట్టారని.. ఎంతో మంది అన్నదాతల మృతికి కారణమయ్యారని ధ్వజమెత్తారు. దేశానికి ప్రధానిగా కాకుండా వ్యాపారవేత్తలకు సెల్స్‌మెన్‌గా మారారని ఆరోపించారు. హైదరాబాద్‌కు వస్తున్న ప్రధాని మోదీ.. తాము వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు.
జలవిహార్ సభా వేదికపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర తరహాలో తెలంగాణలోనూ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే మోదీ, అమిత్ షా.. టీఆర్ఎస్ సర్కారును కూల్చాలని సవాల్ విసిరారు. మీరు మా ప్రభుత్వాన్ని పడగొడితే.. మేము ఢిల్లీలో మీ సర్కారును గద్దె దింపుతామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఆత్మప్రభోదానుసారం ఓటు వేయాలని, అభ్యర్థులను బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోవాలని ఎంపీలు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. వివిధ హోదాల్లో దేశానికి సేవలందించిన యశ్వంత్ సిన్హా గెలిస్తే దేశగౌరవం పెరుగుతుందన్నారు. యశ్వంత్ సిన్హాకు మద్దతుగా జలవిహార్‌లో జరిగిన టీఆర్‌ఎస్ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. న్యాయవాదిగా, ఐఎఎస్‌గా, కేంద్ర మంత్రిగా సేవలందించిన యశ్వంత్ సిన్హాకు అన్ని రంగాల్లో విశేష అనుభవం ఉందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com