KCR: నేడే బీఆర్‌ఎస్‌ ఎంపీల జాబితా

KCR: నేడే బీఆర్‌ఎస్‌ ఎంపీల జాబితా
కరీంనగర్ వేదికగా ఈనెల 12న బహిరంగ సభ... కలిసి సాగాలాని కేసీఆర్‌ ఆదేశం

కరీంనగర్ వేదికగా బీఆర్‌ఎస్‌ అధినేత KCR లోక్ సభ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఉద్యమకాలం నుంచి కలిసివచ్చిన సెంటిమెంట్ తో S.R.R డిగ్రీ కళాశాల గ్రౌండ్స్ లో ఈనెల 12న బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. లోక్ సభకు పోటీ చేయనున్న పార్టీ అభ్యర్థుల్ని కూడా నేడు వెల్లడిస్తామని K.C.R ప్రకటించారు. ప్రాజెక్టుల్లో సమస్యలు వస్తే పరిష్కరించుకోవాలి తప్ప... మొత్తం తీసివేయలేం కదా అని వ్యాఖ్యానించారు. లోక్ సభ ఎన్నికల సమరభేరీ మోగించేందుకు బీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. అభ్యర్థుల ఖరారు ప్రక్రియలో భాగంగా కరీంనగర్, పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గ పరిధి నేతలతో పార్టీ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. బీఆర్‌ఎస్‌ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్, సీనియర్ నేతలు హరీష్ రావు, వినోద్ కుమార్, గంగుల కమలాకర్, సంతోష్ కుమార్.. తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.


లోక్ సభ ఎన్నికల కోసం పార్టీ కార్యాచరణ, అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించారు. కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో... బీఆర్‌ఎస్‌ బీజేపీ మధ్య పోటీ ఉంటుందని తెలిపారు. ఉద్యమం కాలం నుంచి వస్తున్న సెంటిమెంట్ కొనసాగిస్తూ.. S.R.R డిగ్రీ కళాశాల మైదానంలో ఈనెల 12న బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించారు. కరీంనగర్ , పెద్దపల్లి స్థానాలకు సంబంధించి నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. కరీంనగర్ కు వినోద్ కుమార్, పెద్దపల్లికి కొప్పుల ఈశ్వర్ పేర్లను నేతలు ప్రతిపాదించారు. లోక్ సభ బరిలో నిలిచే అభ్యర్థుల్ని నేడు ప్రకటించాలని KCR నిర్ణయించారు. అతి కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని.. రైతులు రోడ్లు ఎక్కే పరిస్థితి వచ్చిందన్న K.C.R.. భారాసతోనే మేలు జరుగుతుందన్న చర్చ ప్రజల్లో ప్రారంభమైందన్నారు.


కాంగ్రెస్ ప్రభుత్వం.. నీళ్లు, కరెంట్ ఇవ్వడం లేదన్నారు. L.R.S విషయంలో గతంలోబీఆర్‌ఎస్‌ను నిందించిన కాంగ్రెస్.. ఇప్పుడు అదే దారిలో వెళ్తున్నారని విమర్శించారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా L.R.S అమలుచేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల్లో సమస్యలు రావడం సహజమన్న కేసీఆర్ .. మధ్య మానేరులో సమస్యలు వస్తే వెంటనే మరమ్మతులు చేశామని తెలిపారు. సమస్య వస్తే ప్రభుత్వాలు వెంటనే పూనుకొని పరిష్కరించాలని.. పన్ను పాడైతే చికిత్స చేసుకుంటాం తప్ప.. మొత్తం పళ్లు పీకేసుకోలేము కదా? అని వ్యాఖ్యానించారు. శాసనసభ ఎన్నికల ఫలితాలు పట్టించుకోవద్దని నేతలంతా కలిసికట్టుగా పని చేయాలని KCR దిశానిర్దేశం చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో లు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఖచ్చితంగా కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో భారాస గెలువబోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story