KCR Yadadri Tour: యాదాద్రి పున:నిర్మాణం కోసం ఎంత ఖర్చు అయ్యిందంటే..

KCR Yadadri Tour (tv5news.in)
KCR Yadadri Tour: ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి శ్రీ లక్ష్మినర్సింహస్వామి ఆలయంలో పర్యటిస్తున్నారు. మొదట నర్సింహ ఆలయ పరిసరాలను ఏరియల్ వ్యూ ద్వారా సీఎం పరిశీలించారు. అనంతరం కాన్వాయ్‌లో ఘాట్‌రోడ్డు ద్వారా కొండపైకి చేరుకున్న సీఎంకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. తర్వాత కేసీఆర్ బాలాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆయనకు వేదాశీర్వచనాలు అందించారు.
స్వామివారి దర్శనం అనంతరం సీఎం కేసీఆర్ ప్రధాన ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం పనులు పూర్తిస్థాయిలో ముగిసిన నేపథ్యంలో మరోసారి సీఎం కేసీఆర్ పనులను పరిశీలించారు. ఇటీవల ముచ్చింతల్‌లో చినజీయర్ స్వామిని కలిసిన సీఎం.. ఆలయ ఉద్ఘాటనపై చర్చించి ముహుర్తాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఆ వెంటనే గడువులోగా ఆలయ పునర్నిర్మాణ, విస్తరణ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని వైటీడీఏ అధికారులను సీఎంవో ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే యాదాద్రిలో పనుల పురోగతిని కేసీఆర్ పరిశీలిస్తున్నారు. యాదాద్రి ఆలయ ఉద్ఘాటన, మహా సుదర్శన యాగం తేదీలను సీఎం ప్రకటించే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయమైన యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా పునర్ నిర్మించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. క్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం పుణ్యస్నానాల కోసం కొండ కిందనున్న గండిచెరువు వద్ద 2.20 ఎకరాల్లో లక్ష్మీ పుష్కరిణి రూపొందించారు. 11 కోట్ల 55 లక్షల వ్యయంతో చేపట్టిన పనులు.. 85 శాతం పూర్తయ్యాయి. ఇప్పటికే అందులో నీటిని నింపి ట్రయల్ రన్ పూర్తి చేశారు.
భక్తుల బస కోసం 18 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో.. 8కోట్ల 35 లక్షలతో నిర్మిస్తున్న మండప భవనం పనులు 95 శాతం పూర్తయ్యాయయాయి. 20 కోట్ల 30 లక్షలతో 2.23 ఎకరాల్లో చేపట్టిన కల్యాణకట్ట తుది దశకు చేరుకుంటుండగా... ఆర్నమెంటల్ పనులు, 2.59 కిలోమీటర్ల అంతర్గత రహదారుల నిర్మాణాలు కొనసాగుతున్నాయి.
ఇక 13 కోట్ల వ్యయంతో.. ప్రసాదాల తయారీ, విక్రయ కాంప్లెక్స్‌లో యంత్రాలను బిగించారు. స్వామివారి దర్శనానికొచ్చే భక్తుల కోసం 4 వేల మంది వేచి ఉండేలా కింది అంతస్తు సహా నాలుగంతస్తుల సముదాయాన్ని విస్తరించి, ఉత్తర దిశలో మందిర ఆకార హంగులతో తీర్చిదిద్దుతున్నారు. మాడ వీధిలో స్వర్ణవర్ణంతో కూడిన ప్రత్యేక దర్శన వరుసలు పూర్తయ్యాయి.
శివాలయం ప్రహరీ ఎత్తును తగ్గించి.. దిమ్మెలపై ఇత్తడి తొడుగులు, వాటిపై త్రిశూలం తరహాలో లైటింగ్ ఏర్పాట్లున్నాయి. ఎదురుగా స్వాగతతోరణం, రథశాల, గార్డెన్ పనులు నడుస్తున్నాయి. విష్ణుపుష్కరిణి పునరుద్ధరణ పనులు కొనసాగుతుండగా...బస్ బే కోసం బండ తొలగింపుతోపాటు చదును చేసే పనులు జరుగుతున్నాయి. కొండపై ఉత్తర దిశలో చేపట్టిన రక్షణ గోడ నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com