KCR: తొలి సంతకంతోనే హైడ్రాను ఎత్తి చెరువులో పడేస్తాం

జగిత్యాల వేదికగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, పేదలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎండగడుతూ.. తనదైన శైలిలో కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. జీవన్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తూనే.. హైడ్రాపై సంచలన ప్రకటన చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైడ్రాను ఎత్తేస్తామని ప్రకటించారు. ‘‘కేసీఆర్ చావాలని కొందరు శాపనార్థాలు పెడుతున్నారు. కానీ, మీరు వెయ్యి జన్మలెత్తినా నేను చావను. పిల్లి శాపాలకు నేను చస్తానా? నా చివరి శ్వాస ఉన్నంత వరకు ఈ నేల కోసమే పనిచేస్తాను’’ అంటూ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో జీవన్ రెడ్డికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత మాట్లాడిన కేసీఆర్ కాంగ్రెస్‌పై విమర్శలతో పాటు తెలంగాణ ఉద్యమ స్మృతులను గుర్తు చేసుకున్నారు. ‘‘జీవన్‌రెడ్డితో నాకు 45 ఏళ్ల స్నేహం ఉంది. ఆయన కేవలం జగిత్యాల కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీలోకి వచ్చారు. ఆయనను బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నాను. వచ్చే ఎన్నికల్లో గెలిచాక, ఆయనకు రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగిస్తాను. ఇది నా మాట.. కేసీఆర్ మాట ఇస్తే తప్పడు. జగిత్యాలను కార్యకర్తలు చూసుకోవాలని, తెలంగాణను నేను, జీవన్‌రెడ్డి చూసుకుంటాం’’ అని కేసీఆర్ అన్నారు. ఏమి హైడ్రా ఇది. పేదల ఇళ్లు కూల్చడంలో అంత దూకుడెందుకు? బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి సంతకం పెట్టి హైడ్రాను పీకి చెరువులో పడేస్తాం. మూసీ వెంబడి 10 వేల మంది పేదల ఇళ్లు కూలగొట్టడం ధర్మమేనా? అని సూటిగా ప్రశ్నించారు.
‘ఆరు గ్యారంటీలు.. 420 హామీలు అమలు చేస్తామన్నారు. కానీ, ప్రజాసంక్షేమాన్ని ఆకాంక్షించి ఒక్క కొత్త పథకాన్ని కూడా అమలు చేయలేదు. ఉన్న పథకాలను మూలకు పడేశారు. ఏ రంగంలోనూ ప్రగతి కనిపించడం లేదు. నీటిపారుదలను పట్టించుకోవడం లేదు. పట్టణ, గ్రామీణాభివృద్ధి రంగంలో ఏమీ జరగడం లేదు. మేము పల్లె ప్రగతితో దేశానికి ఆదర్శంగా నిలిచాం. వైకుంఠధామాలు కట్టాం, క్రీడాప్రాంగణాలు నిర్మించాం, ఊరూరికి ట్రాక్టర్లు అందించాం. ఇప్పుడవన్నీ మూలకు పడ్డాయి. ఎమ్మెల్యేల జీతాలు బందు పెట్టి పంచాయతీలకు పైసలిచ్చాం. ఇప్పుడు మున్సిపాలిటీలు మురికి కూపాలయ్యాయి. జీవన్‌రెడ్డి లాంటి గొప్ప నాయకుడే.. ఈరోజు ‘రాష్ట్రంలో కాంగ్రెస్ పోవాలె.. బీఆర్‌ఎస్ రావాలె’ అంటున్నారు. ఇది ఆయనొక్కరి మాటే కాదు. రాష్ట్ర ప్రజలందరి మాట. ఏదేమైనా మనం మళ్లీ కచ్చితంగా అధికారంలోకి రావాలి. అని కేసీఆర్ అన్నారు.
‘నేను జగిత్యాలలో సభ పెడుతున్నా అనగానే కాటారంలో రైతుభరోసా డబ్బులు వేశారు. మళ్లీ ఏమైనా నిధులు ఇవ్వాలంటే నేడు ఎక్కడైనా ఇంకో సభ పెట్టాలా?’ అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఇన్నాళ్లూ వాళ్లేం చేస్తారో చేయనివ్వమని.. అవకాశమిచ్చాను. బయటకు రాలేదు.. మాట్లాడలేదు. కానీ, చిల్లర మాటలు తప్ప.. నిర్మాణాత్మకమైన కార్యక్రమం, గొప్ప పథకం ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు. మిషన్ భగీరథ నీళ్లు ఐదేళ్లు పుష్కలంగా వస్తే.. ఇప్పుడు ఏ రోగం పుట్టి నీళ్లు రావడం లేదు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నీళ్ల కోసం ప్రజలు పోరాడాలని, అధికారులను నిలదీయాలని పిలుపునిచ్చారు. సాగునీరు, తాగునీటి నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
