కీసరలో రూ.కోటి 10 లక్షల లంచం కేసులో మరో సంచలన మలుపు

కీసరలో కోటి 10 లక్షల రూపాయల లంచం కేసు మరో సంచలన మలుపు తిరిగింది. ఈ కేసులో MRO నాగరాజు ఇప్పటికే ఆత్మహత్య చేసుకోగా, ఇప్పుడు కందాడి ధర్మారెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డడం కలకలం రేపుతోంది. కుషాయిగూడలో చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు ధర్మారెడ్డి. అతను 33 రోజులపాటు జైల్లో ఉండి ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇంతలోనే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది..? ఎవరైనా బెదిరించారా..? ఇంత పెద్ద వయసులో ప్రాణాలు తీసుకోవాలనేంత నిర్ణయం తీసుకున్నారంటే ఏం జరిగింది. రాంపల్లి భూముల వ్యవహారంలో బడాబాబులు తెరవెనుక ఉన్నారా ఇప్పుడిలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. జైలు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఆయన తీవ్ర మనస్తాపంతో కనిపించారని ధర్మారెడ్డి భార్య అంటోంది.
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని కీసర మండలం రాంపల్లిలో విలువైన ప్రభుత్వ భూముల్ని అక్రమంగా తన పేరుపైకి మార్పించుకునేందుకు ధర్మారెడ్డి కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి ప్రయత్నాలు చేసినట్టు వచ్చిన ఆరోపణలు అప్పట్లోనే సంచలనంగా మారాయి. అప్పటి తసహీల్దార్ నాగరాజుతో కలిసి స్కెచ్ వేసి 24 ఎకరాల భూమికి నకిలీ పత్రాలు సృష్టించి పాస్‌బుక్‌లు సంపాదించిన వ్యవహారం బయటపడడంతో MRO నాగరాజుతోపాటు, శ్రీకాంత్‌రెడ్డి, ధర్మారెడ్డి కూడా అరెస్టయ్యారు. ఈ కేసులో ACB దర్యాప్తు కొనసాగుతోంది. ఇదే కేసులో ముగ్గురు రియల్టర్లను కూడా ACB అరెస్టు చేసింది. ఓ పక్క ఈ విచారణ జరుగుతుండగానే అక్టోబర్ 14న చంచల్‌గూడ జైల్లో నాగరాజు సూసైడ్ చేసుకున్నాడు. జైల్లోనే అతను టవల్‌తో ఊరి బిగించుకుని ఆత్మహత్యకు పాల్పడడంపై ఆయన భార్య అనేక అనుమానాలను వ్యక్తం చేసింది. దీని వెనుక ఏదో జరిగింది అనే అనుమానాలు కూడా వచ్చాయి. ఇంతలో ఇప్పుడు ధర్మారెడ్డి ఆత్మహత్య చేసుకోవడంతో కేసు మరింత సంక్లిష్టంగా మారింది. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న ధర్మారెడ్డి కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి బెయిల్ రాకపోవడంతో ప్రస్తుతం జైల్లో ఉన్నాడు.
కీసర మండలం రాంపల్లిలోని సర్వే నంబర్ 604-614 మధ్య ఉన్న భూముల్లో సాధ్యమైనంత జాగా కబ్జా చేసే ప్రయత్నాల్లో భాగంగానే కోటి 10 లక్షల లంచం డీల్ కుదిరిన విషయం బయటపడడం సంచలనం అయ్యింది. ఆగస్టు 15న నాగరాజును అరెస్టు చేశారు. రికార్డు స్థాయిలో కోటి రూపాయల లంచం వ్యవహారం బయటపడడంతో ACB కూడా దీనిపై లోతుగానే దర్యాప్తు చేస్తోంది. అటు, ACB కస్టడీ సమయంలో నాగరాజు కొంత కీలక సమాచారం కూడా బయటపెట్టినట్టు తెలిసింది. ఇంతలోనే అతను సూసైడ్ చేసుకోవడంతో దర్యాప్తులో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఇప్పుడు రియల్టర్ ధర్మారెడ్డి కూడా ఉరి వేసుకుని చనిపోవడంతో కేసును ఛేదించడం సవాల్‌గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com