KK: అందుకే బీఆర్‌ఎస్‌ను వీడుతున్నా: కేకే

బీఆర్‌ఎస్‌లో సరికోవాల్సినవి సరిచేసుకోనందునే పార్టీని వీడాల్సి వస్తోందని కేశవరావు పేర్కొన్నారు. దేశంలో కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నందునే ఘర్‌వాపసీకి నిర్ణయించినట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎంతో గౌరవించారన్న కేకే... తెలంగాణను పునర్‌నిర్మించాలన్న ఉద్దేశ్యంతోనే దాదాపు పదేళ్లపాటు ఆ పార్టీలో కొనసాగినట్లు చెప్పారు. 60ఏళ్లలో ఎన్నో పదవుల్ని అనుభవించానన్న కేకే...అవసరమైతే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని చెప్పారు. 13 ఏళ్ల తీర్థయాత్ర చేశాక ఇంటికి పోయినట్టే సొంతగూడు కాంగ్రెస్‌కు వెళ్తున్నానన్న కేకే... త్వరలో కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మీతో కలిసి హస్తం పార్టీలో చేరతానని వెల్లడించారు.
లోక్‌సభ ఎన్నికల వేళ. అధికార కాంగ్రెస్‌లోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ కండువా కప్పుకోగా.... బీఆర్‌ఎస్ కీలక నేత కేశవరావు హస్తం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దీపాదాస్ మున్షీ, రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. త్వరలోనే పార్టీలోకి వస్తానని తెలిపారు. భారాసని ఒక్క కుటుంబమే నడిపిస్తుందనే భావన ప్రజల్లో ఉందన్న ఆయన... కొన్ని సరిచేసుకోవాల్సినవి బీఆర్‌ఎస్ సరిచేసుకోకపోవడం వల్లే పార్టీ వీడుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నందునే ప్రజస్వామ్య పరిరక్షణ కోసం సొంతగూటికి చేరాలని నిర్ణయించినట్లు కేశవరావు తెలిపారు.
తెలంగాణ సాధనపై తెరాస కంటే ముందే కాంగ్రెస్ ఆలోచించిందన్న కేశవరావు తెలంగాణ కోసం చాలా మంది నాయకులు నిరాహార దీక్షలు చేశారని గుర్తు చేశారు. 1998లోనే తెలంగాణ కోసం పోరాటం మొదలైందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కేసీఆర్ హామీ ఇవ్వడం వల్లే భారాసలో చేరినట్లు కేశవరావు వివరించారు. ప్రత్యేకరాష్ట్రాన్ని పునర్‌నిర్మించాల్సిన అవశ్యకత వల్లే గులాబీపార్టీలో ఇన్నేళ్లూ కొనసాగినట్లు తెలిపారు. అవసరమైతే తన రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేస్తానన్న కేకే... కుమార్తె, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మీతో కలిసి త్వరలోనే కాంగ్రెస్‌లో చేరుతానని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com