తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..!

సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది.. ముఖ్యంగా వ్యవసాయంపై విస్తృత చర్చ జరిగింది.. వర్షాలు, పంటలు, సాగునీటి లభ్యత, ఎరువులు, ఇతర వ్యవసాయ అంశాలపై కేబినెట్ చర్చించింది.. పత్తిసాగుపై మంత్రి మండలి ప్రత్యేకంగా చర్చించింది. తెలంగాణ పత్తికి ఉన్న ప్రత్యేక డిమాండ్ వల్ల సాగు మరింత పెంచాలని, అందుకోసం రాష్ట్ర రైతాంగాన్ని సమాయత్తపరచాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించింది. అటు రుణమాఫీ అంశం కూడా చర్చకు వచ్చింది.. రాష్ట్రంలో ఇప్పటి వరకు పంట రుణ మాఫీకి సంబంధించిన వివరాలను ఆర్థిక శాఖ కేబినెట్ ముందుంచింది. కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారం పడటం వల్ల గత రెండేళ్లుగా పాతికవేల వరకు వున్న రుణాలను మాత్రమే మాఫీ చేశారు.. ఈ నేపథ్యంలో ఈనెల 15 నుంచి నెలాఖరు నాటికి 50వేల వరకు వున్న పంట రుణాల మాఫీని పూర్తిచేయాలని కేబినెట్ ఆదేశించింది.. దీని ద్వారా 6 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు.
ఇక కొత్తగా ఏర్పాటు చేయబోయే ఐదు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులపైనా కేబినెట్ చర్చించింది. తీసుకోవాల్సిన చర్యలు, ఇప్పటి వరకు జరిగిన పురోగతిపై చర్చించారు. త్వరలోనే వీటి నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది. వరంగల్, చెస్ట్ ఆస్పత్రి ప్రాంగణం, టిమ్స్, గడ్డి అన్నారం, అల్వాల్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం చేపట్టాలని ఆదేశించింది.. అటు పటాన్‌చెరులో కార్మికులు, ఇతర ప్రజల ప్రయోజనాల కోసం మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని మంజూరు చేసింది..అలాగే అన్ని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఇకపై టిమ్స్‌గా నామకరణం చేయాలని కేబినెట్ నిర్ణయించింది.. అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ఒక్కచోటనే అందించేందుకు సమీకృత వైద్య కళాశాలలుగా తీర్చిదిద్ది సత్వరమే వైద్యసేవలు ప్రారంభించాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా పరిస్థితులపైనా కేబినెట్ చర్చించింది. పలు రాష్ట్రాల్లో పరిస్థితి, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సిచ్యుయేషన్, వ్యాక్సినేషన్, ఆస్పత్రుల్లో ముందస్తు ఏర్పాట్లు, మౌలిక వసతులపై మంత్రులంతా చర్చించారు. రాష్ట్రంలోని అనాథలు, అనాథ శరణాలయాల స్థితిగతులపైనా చర్చిస్తున్నారు.. సమస్యలు, అవగాహన విధాన రూపకల్పన కోసం మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన సబ్ కమిటీ ఏర్పాటు చేశారు.. సభ్యులుగా మంత్రి హరీష్‌రావు, కేటీఆర్, సబిత, శ్రీనివాస్‌గౌడ్, తలసాని, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి ఉంటారు.. అటు కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లల పూర్తి వివరాలు ఇవ్వాలని వైద్య శాఖ కార్యదర్శిని కేబినెట్ ఆదేశించింది.. అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి సమగ్ర సమాచారం తెప్పించాలని ఆదేశించారు.
కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంపై మంత్రివర్గం చర్చిస్తోంది. ఆయా జిల్లాల నుంచి ప్రాథమిక వైద్య కేంద్రాల స్థాయి నుంచి వివరాలను కేబినెట్ ముందుంచారు వైద్యాధికారులు.. ఈ జిల్లాల్లో తీసుకుంటున్న చర్యలు, ఆక్సిజన్, మందులు, బెడ్స్, ఔషధాల లభ్యతపై విస్తృతంగా చర్చ జరిగింది. అన్ని జిల్లాల్లో విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహించి, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని, అన్ని రకాల మందులు, ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని వైద్యాధికారులకు కేబినెట్ ఆదేశించింది. నూతనంగా మంజూరు చేసిన ఏడు మెడికల్ కాలేజీలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అందుకోసం అవసరమైన మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. మెడికల్ కాలేజీల ప్రారంభానికి కావాల్సిన నిర్మాణాలను చేపట్టాలని, వసతులను సత్వరమే ఏర్పాటు చేయాలని రోడ్డు భవనాల శాఖను కేబినెట్ ఆదేశించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com