TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. తాజాగా భారత పాస్‌పోర్టు అథారిటీ.. ఆయన పాస్‌పోర్టును రద్దు చేసింది. ఈ సమాచారం హైదరాబాద్ పోలీసులకు అందించింది. దీంతో ఆయనకు అమెరికాలో గ్రీన్ కార్డు రద్దయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన ఇండియాకు తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభాకర్‌రావు ఎస్‌ఐబీ చీఫ్‌గా పనిచేసిన సమయంలోనే ఫోన్ ట్యాపింగ్ కార్యకలాపాలు ఉధృతంగా జరిగాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఎస్‌వోటీ అనే విభాగాన్ని స్థాపించి, దాని ఆధ్వర్యంలో రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, అధికారుల ఫోన్లు ట్యాప్ చేసి, ఆ సమాచారాన్ని ప్రయోజనాల కోసం వాడారని ఆరోపణలు వచ్చాయి. మరి కొంతమందిని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్టు కూడా అధికారులు చెబుతున్నారు.
రాజకీయ నేతల హస్తం
ఫోన్ ట్యాపింగ్ చర్యల ద్వారా ఓ రాజకీయ పార్టీకి, ముఖ్యంగా ఆ పార్టీలో ఉన్న కీలక నేతలకు లబ్ధి చేకూరేలా ప్రభాకర్‌రావు వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో మల్టీ లెవెల్ సమాచార సేకరణ, ఓ ఛానల్ అధినేత, ఎస్‌ఐబీ మాజీ అధికారులు పాల్గొన్నట్టు వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ప్రభాకర్‌రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఐపీఎస్ పదవీ విరమణ అనంతరం ఆయన అమెరికాలో స్థిరపడ్డారు. దర్యాప్తునకు ఆయన సహకరించడం లేదు. తొమ్మిది నెలలు దాటినా దేశంలోకి తిరిగిరాలేదు. దీంతో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై పోలీసులు తీవ్రంగా ప్రతి ఉత్తరం సమర్పించారు. ఆయన పాత్ర కీలకం కావడంతో, కోర్టు ఆయన బెయిల్‌ను తిరస్కరించాలని కోరారు.
భారత్‌కు తిరిగి రాక తప్పదా.. ?
ట్రంప్ పాలన తర్వాత అమెరికాలో విదేశీయులపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయి. వయసు 60 దాటిన వారిపై ఎక్కువ ఎఫెక్ట్ ఉండగా... పాస్‌పోర్ట్ రద్దయిన వ్యక్తులను ఎయిర్‌పోర్టులోనే నిలిపివేస్తున్నారు. ప్రభాకర్‌రావు మీద కూడా ఇలాంటి చర్యలు తీసుకునే అవకాశముంది. ఫలితంగా ఆయనను ఇండియాకు పంపే ప్రక్రియ వేగవంతమవుతోంది. అమెరికాలో వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న వేళ ప్రభాకర్ రావు తిరిగి భారత్ దేశానికి రావడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే ఈ కేసులో మరిన్ని సంచలనాలు బయటపడే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com