Telangana Congress: కాక రేపుతున్న ఖమ్మం రాజకీయాలు

ఎన్నికలకు ముందే ఖమ్మం రాజకీయాలు కాక రేపుతున్నాయి. రేపు జనగర్జన సభలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. రాహుల్ గాంధీ హాజరవుతున్న సభను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు.. చుట్టు పక్కల జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనసమీకరణ చేస్తోంది. ఓ వైపు సభకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతుండగా.. మరో వైపు అధికార బీఆర్‌ఎస్.. కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సభకు ఒక రోజు ముందే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య రాజకీయ సెగలు మొదలయ్యాయి. మంత్రి అజయ్ వర్సెస్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఇరువర్గాల నాయకులు సై అంటే సై అంటున్నారు. అంతటితో ఆగకుండా బహిరంగ లేఖలు, పోస్టర్లతో పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అనుచరులు డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు.. చీకటి కార్తిక్‌లను టార్గెట్ చేస్తూ మంత్రి అజయ్ వర్గీయులు వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపుతోంది. పొంగులేటితో పాటు ఆయన అనుlచరులను టార్గెట్ చేస్తూ పోస్టర్లు వెలిశాయి. మంత్రి అజయ్‌పై చిల్లర కామెంట్లు చేసినవాళ్లు కాళ్లు పట్టుకుని క్షమించమని అడగాలంటూ హెచ్చరించారు. చీకటి కార్తిక్‌కు పట్టిన గతి పడుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఇదే క్రమంలో వారి శవాలు కూడా దొరకవు అంటూ రాసుకొచ్చారు. పొంగులేటి ఖబడ్దార్ అంటూ పోస్టర్లలో రాసి ఉండటం సంచలనంగా మారింది.
అధికార పార్టీ నాయకుల బెదిరింపులపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. నా అనుచరులను చంపుతామని బెదిరిస్తున్నారు. వార్నింగులకు భయపడేది లేదు.. వచ్చే ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. తనకు గానీ.. తన అనుచరులకు గానీ ఏం జరిగినా ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com