khareef season: జూలై వచ్చినా వాన జాడ లేదు

khareef season: జూలై వచ్చినా వాన జాడ లేదు


ఖరీఫ్‌ పంట కాలం వచ్చేసింది. జూలై నెల వచ్చినా ఇంకా పూర్తిస్థాయిలో వాన జాడ కనిపించడం లేదు.రైతులు పొలం పనుల్లో బిజీగా ఉండాల్సిన టైంలో వాన జాడ కనిపించడం లేదు.పంట కాలువలు,చెరువులు కళకళలాడ్సిన సమయంలో సాగునీటి వనరులన్నీ వెలవెలబోతున్నాయి. నీటి కోసం అర్రులు చాస్తున్నట్లు పొలంలో నేల నెర్రెలు కనిపిస్తున్నాయి. ఇదేం పరిస్థితి అంటూ అన్నదాతలు తలలు పట్టుకుంటున్నారు.రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకాయని వాతావరణ శాఖ చెపుతున్నా..ఆ చాయలు కనిపించకపోయేసరికి రైతు ఆవేదన చెందుతున్నాడు. వాన ఎప్పుడు వస్తుందా అంటూ ఆశగా ఎదురు చూస్తున్నాడు.

మరోవైపు చినుకు జాడ కోసం అన్నదాత ఎదురుచూస్తున్నారు.ఎండుతున్న నారును బతికించేందుకు ఉన్న అరకొర వసతులను వెతుక్కుంటున్నారు.మరికొందరు దుక్కి దున్ని విత్తనం వేసేందుకు చూస్తున్నారు. అయితే ఈ సీజన్‌లో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొంది.జోరు వర్షాలతో కురియాల్సిన సమయంలో చిన్న చినుకు కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఖరీఫ్‌ పంటకు కావాల్సిన సాగునీరు అయితే ఎక్కడా లేదు. చెరువులేవీ నిండలేదు. సాగునీటి ప్రాజెక్టుల్లో కొన్నింటిలో కనీస స్థాయిలో నీరు చేరలేదు.

వరి నారు మడులు వేసిన ప్రాంతాల్లో మరో రెండు వారాల్లో నాట్లు వేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే నారుమళ్లకు కూడా నీరు లేని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. ఈ కారణంగా వరి నారుమళ్లు ఎండిపోయి కన్పిస్తున్నాయి. పంట పొలంలో నేల నెర్రెలు ఇచ్చేస్తోంది. జూన్‌లో అప్పుడప్పుడు కురిసిన కొద్ది వర్షాలకు రైతులు నారుమళ్లు వేశారు. కొన్ని చోట్ల విత్తనాలు మాడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఖరీఫ్‌ ప్రారంభ దశలోనే సాగునీటికి అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉంటే వరి నారుమళ్లకు నీటి తడి అందించేందుకు గట్లు కట్టాల్సిన పరిస్థితి నెలకొందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ ఏడాది వేసవి ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. అనుకున్నట్లే ఎండ తీవ్రత కొనసాగుతుంది.జూన్‌తో ముగియాల్సిన ఎండలు జులైలో కూడా కొనసాగడంపై ఆందోళన వ్యక్తమవుతుంది. పంటలు సరైన సమయంలో చేతికి రాకపోవడంతో మార్కెట్‌లు వ్యాపార లావాదేవీలు లేక వెలవెల బోతున్నాయి. ప్రస్తుతం వర్షాలు కనీస స్థాయిలో కురవడం లేదు. జూన్‌ నెలలో సాధారణ వర్షపాతమూ నమోదు కాలేదు. కొన్ని జిల్లాల్లో ఏకంగా 90శాతం లోటు ఉంది. ఖరీఫ్‌ వ్యవసాయ పనులు అంతంతమాత్రంగా సాగుతున్నాయి. రైతులు అనేక చోట్ల ఖరీఫ్‌ మెట్ట పంటలుగా వేసిన పత్తి, మొక్కజొన్న కూడా ఎండిపోతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story