KishanReddy: దేశ ప్రతిష్ఠను పెంచినది మోదీనే -కిషన్‌రెడ్డి
దేశ భవిష్యత్తు కోసం మరోసారి భాజపాకు పట్టం కట్టాలని భాజపా రాష్ట్రాధ్యక్షుడు కిషన్‌రెడ్డి కోరారు. కాంగ్రెస్ హయాంలో 12లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించిన కిషన్‌రెడ్డి పదేళ్లుగా పారదర్శక పాలన అందిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో వీలైనన్ని ఎక్కువ MP సీట్లు సాధించేలా కసరత్తు ప్రారంభించిన భాజపా విజయ సంకల్ప యాత్రలతో నియోజకవర్గాలను చుట్టేస్తోంది. భారాస, కాంగ్రెస్‌లపై విమర్శలు గుప్పిస్తూ జనాల్లోకి వెళ్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్న భాజపా రాష్ట్రంలోనూ సత్తా చాటాలని భావిస్తోంది. 17 ఎంపీ నియోజకవర్గాలను చుట్టేసేలా విజయ సంకల్ప యాత్రలను చేపట్టిన కమళదలం రోడ్‌షోలు, సభలతో జనాల్లోకి వెళ్తోంది. గోషామహల్ అసెంబ్లీ పరిధిలోని జుమ్మారత్ బజార్‌లో రోడ్‌షో నిర్వహించిన కిషన్‌రెడ్డి...మరోసారి మోదీనే ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు. అంతకుముందు కార్వాన్‌లో సంకల్పయాత్రలో పాల్గొన్న కిషన్‌రెడ్డి...దాదావాడి జైన్ మందిర్‌లో ప్రత్యేక పూజలు చేశారు. మజ్లీస్ పార్టీ ప్రజాస్వామ్యానికి, అభివృద్ధికి వ్యతిరేకంగా పనిచేస్తుందన్న భాజపా రాష్ట్రాధినేత హైదరాబాద్‌లోనూ భాజపా జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఆరు గ్యారంటీల పేరుతో మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శించారు. నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లో ఎనిమిదో రోజు విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న లక్ష్మణ్ అంతకుముంద సోమశిల, సింగోటం ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్, భారాస పార్టీలు తోడు దొంగలేనని విమర్శించిన లక్ష్మణ్ గులాబీ పార్టీతో పొత్తు ఎన్నటికీ ఉండదని స్పష్టం చేశారు.
రేషన్ కార్డులు ఉన్నవారికే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామనడం...పేదలను మోసం చెయ్యడమేనని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజాహిత యాత్ర సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చేరింది. ప్రజా సమస్యలపై కొట్లాడితే..గత ప్రభుత్వం తనపై కేసులు పెట్టిందని పొన్నం ప్రభాకర్ ఏనాడైనా పోరాడాడా అని ప్రశ్నించారు.
ప్రస్తుత రాజకీయాల్లో నిబద్ధత, నిజాయతీతో పనిచేస్తున్న ప్రధాని మోదీని మరోసారి గెలిపించాలని కేంద్రమంత్రి మహేంద్రనాథ్ పాండే తెలిపారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజక వర్గంలోని విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. విపక్షాలు కుటుంబ పాలన కోరుకుంటే..మోదీ మాత్రం సేవకుడిగా ప్రజల కోసం పనిచేస్తున్నారని వివరించారు. భారాసతో లోపాయికారి ఒప్పందం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టుపై CBI విచారణ కోరట్లేదని భాజపా జాతీయాధ్యక్షురాలు DK అరుణ జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో విమర్శించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com