TG: తెలంగాణ ప్రగతే లక్ష్యం

TG: తెలంగాణ ప్రగతే లక్ష్యం
కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ స్పష్టీకరణ... బీజేపీ సంబరాలు

ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని మంత్రివర్గంలో తెలంగాణ నుంచి ఇద్దరికి అమాత్య యోగం వరించింది. సికింద్రాబాద్‌ MP, భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, కరీంనగర్ MP బండి సంజయ్‌ ఆదివారం కేంద్రమంత్రులుగా ప్రమాణం స్వీకారం చేశారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం అంకిత భావంతో పనిచేస్తానని కిషన్‌ రెడ్డి తెలిపారు. వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా రాష్ట్ర ప్రగతికి పాటుపడతానని బండి సంజయ్‌ వెల్లడించారు. మరో వైపు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.

ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో 8 సీట్లతో రాష్ట్రంలో కమలం పార్టీ సత్తాచాటింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో మూడోసారి కొలువుదీరిన కేంద్రప్రభుత్వంలో రాష్ట్రం నుంచి ఇద్దరిని మంత్రి పదవులు వరించాయి. సికింద్రాబాద్ MP కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా, కరీంనగర్‌ లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్‌ కేంద్ర సహాయ మంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. మూడు సార్లు MLAగా...రెండు సార్లు MPగా గెలిచిన కిషన్‌రెడ్డి... రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో జన్మించాడు. మధ్యతరగతి రైతు కుటుంబంలో నుంచి వచ్చిన కిషన్‌రెడ్డి...లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ స్ఫూర్తితో బాల్యం నుంచే నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ కీలకపాత్ర పోషించారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృష్ణానది నుంచి గోదావరి నది వరకూ ‘తెలంగాణ పోరుయాత్ర’ నిర్వహించి 333 సమావేశాల్లో ప్రసంగించారు. జనతా పార్టీ యువమోర్చా నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కిషన్‌రెడ్డి.....అంచెలంచెలుగా కేంద్రమంత్రి స్థాయికి చేరుకున్నాడు. చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్ల విషయంలో తీసుకున్న ప్రత్యేక చొరవకు గాను యునిసెఫ్‌ ‘ఛైల్డ్‌ ఫ్రెండ్లీ లెజిస్లేటర్‌’ గౌరవాన్ని పొందారు.

రాజకీయ వారసత్వం లేకపోయినా....కష్టపడి పనిచేసిన సాధారణ కార్యకర్తలకు సైతం మంత్రి పదవులు కట్టబెట్టిన ఘనత కేవలం బీజేపీకే దక్కుతుందని కిషన్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ నుంచి ఇద్దరు, AP నుంచి ఒకరికి మంత్రిపదవులు ఇచ్చినందుకు ప్రధాని మోదీ, భాజపా అధ్యక్షుడు JP నడ్డాకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పకుండా అమలుచేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందన్న కిషన్‌రెడ్డి....రాష్ట్రంలోనూ భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేసేలా కృషి చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

కరీంనగర్‌ నుంచి దిల్లీ దాకా ఎదిగిన నేతగా బండి సంజయ్‌ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. సామాన్య కార్యకర్తగా భాజపాలో పని చేసిన సంజయ్‌....ఇంతింతై అన్నట్లుగా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎదిగారు. బండి సంజయ్‌ స్వస్థలం కరీంనగర్‌ కాగా..... స్థానిక శిశుమందిర్‌లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచే RSSలో స్వయం సేవకుడిగా పని చేస్తూ...వివిధ హోదాలకు చేరుకున్నారు. ఆడ్వాణీ రథయాత్రలో ఇన్‌ఛార్జిగానూ వ్యవహరించారు. కరీంనగర్‌ అర్బన్‌ సహకార బ్యాంక్‌ పాలకవర్గ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ఆరంభించిన బండి సంజయ్‌...భాజపాలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో MP గెలిచిన సంజయ్‌....కేంద్ర సహాయ మంత్రి పదవిని దక్కించుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story