KODANDARAM: కోదండరాం సార్ భవిష్యత్తు ఏంటి.?

తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం , సీనియర్ జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ నియామకాలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుతో ఈ ఇద్దరు నేతల ఎమ్మెల్సీ పదవులు తాత్కాలికంగా రద్దయ్యాయి. ఈ నియామకాలపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. సుప్రీంకోర్టు తీర్పులు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వానికి వరుసగా షాక్‌లు ఇస్తున్నాయి. దీంతో, దాదాపు రెండేళ్ళుగా సాఫీగానే నడిచిన ప్రభుత్వానికి ఇప్పుడు అన్నీ అపశకునాలే ఎదురవుతున్నాయా అన్న చర్చ మొదలైంది రాజకీయవర్గాల్లో.. తాజాగా బుధవారంనాడు సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బేనన్న వాదన బలపడుతోంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన కోదండరాం, అమీర్ అలీ ఖాన్ల సభ్యత్వాలను రద్దు చేసింది సుప్రీం కోర్ట్. సరైన అర్హతలు లేవని, అసలు వాళ్ళు ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేయడమే తప్పు అంటూ కీలక తీర్పు ఇచ్చింది. అయితే.. గతంలో హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ తామిచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరించింది సుప్రీం. గతంలో…బీఆర్ఎస్ హయాంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్ కుమార్ కుర్రా సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించింది.
టీజేఎస్ నేతల గరంగరం
జేఏసీ ఛైర్మన్‌గా ఎంతో పేరున్న ఆయన..పార్టీ పెట్టడం ఒక ఎత్తు అయితే.. ఆ తర్వాత కాంగ్రెస్‌కు మద్దతివ్వడం మరో ఎత్తు. సరే కాంగ్రెస్‌కు సపోర్ట్ చేసి అధికారంలోకి వచ్చేలా చేసినా..తమకు దక్కిందేమి లేదని గుర్రుగా ఉన్నారట జనసమితి నేతలు. తమ అధినేతకు ఇచ్చిన పోస్ట్ కూడా ఊస్ట్ అయ్యేలా చేశారని అసహనం వ్యక్తం చేస్తున్నారట. దీంతో కోదండరాం సార్ ఏదో అనుకుంటే ఏదో అయిందన్న చందంగా మారిందట పరిస్థితి. తెలంగాణ జన సమితి పార్టీ నేతలు అధికార కాంగ్రెస్ పార్టీ తీరుపై గుర్రుగా ఉన్నారట. కాంగ్రెస్‌కు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నా..ఎన్నికల్లో గెలిచేందుకు అండగా నిలిచినా తమకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని అసంతృప్తితో ఉన్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా తీసుకోకుండా భేషరతుగా మద్దతిస్తే.. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా తమను పట్టించుకోవడం లేదంటున్నారట.
తెలంగాణలో ప్రొఫెసర్ కోదండరాం అంటే ప్రత్యేక గుర్తింపు. ఉద్యమ సమయంలో పొలిటికల్ జేఏసీ ఛైర్మన్‌గా పనిచేసిన ఆయనకు అన్ని రాజకీయ పార్టీలతో పాటు అన్ని వర్గాల్లో మంచి ఒపీనియన్ ఉండేది. రాష్ట్రం ఏర్పడ్డాక కూడా జేఏసీని అలాగే కొనసాగిస్తూ..చివరికి తెలంగాణ జనసమితి పేరుతో పొలిటికల్ పార్టీని పెట్టారు. టీజేఎస్‌ను ఇండిపెండెంట్‌గా నడపకుండా ఆయన కాంగ్రెస్‌కు మద్దతివ్వడంపైనే అప్పట్లో వ్యతిరేకత వ్యక్తమైంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసిన టీజేఎస్ ఆ తర్వాత కాంగ్రెస్‌కు కాస్త దూరమైంది. పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్‌కు దగ్గరైయ్యారు కోదండరాం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా తీసుకోకుండా కాంగ్రెస్‌కు ఔట్రైట్ సపోర్ట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com