Komatireddy Raj Gopal Reddy: కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బీజేపీలోకి సీనియర్ నేత..!

Komatireddy Raj Gopal Reddy: కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బీజేపీలోకి సీనియర్ నేత..!
Komatireddy Raj Gopal Reddy: తెలంగాణ వ్యాప్తంగా బ్రాండ్ ఇమేజ్ కలిగిన నాయకుల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరు.

Komatireddy Raj Gopal Reddy: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా బ్రాండ్ ఇమేజ్ కలిగిన నాయకుల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడుగానే కాకుండా.. బడా బిజినెస్ మాన్ గానూ పేరున్న వ్యక్తి. గతంలో టీపీసీసీ అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నప్పటికీ.. సోదరుడు వెంకటరెడ్డితో ఉన్న అంతర్గత విభేదాలతో ఇద్దరూ ఎడమకం పెడమకంగా ఉంటూ వస్తున్నారు. 2009 పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి గెలుపొందగా.. అదే స్థానం నుంచి 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

ఆ తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగి.. TRS అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి మీద భారీ మెజారిటీతో గెలుపొందారు. అనంతరం 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో.. మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా.. TRS సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మీద పోటీచేసి ఘన విజయం సాధించారు. అయితే అనుకున్న విధంగా కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడంతో.. నాయకుల మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. బీజేపీ అధినాయకత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తడం, కాంగ్రెస్ పై విమర్శలు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది.

కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి.. కమలం గూటికి చేరుతారని ప్రచారం జోరుగా జరిగింది. అనుకున్నట్లే రాజగోపాల్ రెడ్డి సైతం ఆ ప్రయత్నాలు చేశారు. నియోజకవర్గ నాయకులతో సమావేశమై బీజేపీలోకి వెళ్లాలనే తన నిర్ణయాన్ని ప్రకటించారు. కానీ కేడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. కానీ అప్పటి నుంచి కాంగ్రెస్ తో అంటిముట్టనట్టుగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. MLA కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తాజాగా ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో రహస్యంగా సమావేశమైనట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. వారిద్దరూ దాదాపు 45 నిమిషాలపాటు చర్చలు జరిపినట్టు తెలిసింది.

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ అందుకు తగ్గట్టుగానే దూకుడుగా వ్యవహరిస్తూ వస్తోంది. కొద్దిరోజుల కిందట హైదరాబాద్ లో జరిగిన బీజేపీ జాతీయ సమావేశాలు, ప్రధానిమోదీ బహిరంగ సభ పార్టీకి మరింత బూస్టప్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మోదీ, అమిత్ షా, నడ్డాల దిశానిర్దేశంతో.. పార్టీలో వలసల కోసం ద్వారాలు తెరిచినట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలో ఒక నాయకుడిని కమలం గూటికి చేర్చుకుంటే.. ఆజిల్లా మొత్తం మీద ప్రభావం ఉండేలాగా బీజేపీ నాయకత్వం పక్కాగా ప్లాన్ చేసినట్లు సమాచారం.

ఇందులో భాగంగానే.. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి తెలంగాణ ఉద్యమకారుడు, జిట్టా బాలకృష్ణారెడ్డిని కమలంపాటి గూటిలోకి చేర్చుకున్నారు. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సైతం కాషాయం కండువా కప్పేందుకు కార్యాచరణ ప్రారంభించారు. వరుస ఉపఎన్నికలు తేవడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రాష్ట్ర రాజకీయాల్లోనే తలమునకలయ్యేలా చేయాలనేది బీజేపీ ఎత్తుగడ అని ఆపార్టీ వర్గాల సమాచారం. కేసీఆర్‌ను జాతీయ రాజకీయాల్లోకి రాకుండా నిలువరించడంతోపాటు.. విపక్షాలను సమీకరించే ప్రయత్నాలను అడ్డుకోవాలనేది అమిత్‌షా వ్యూహమని వారంటున్నారు.

ఇందులో భాగంగా రేవంత్‌రెడ్డికి, రాజగోపాల్‌రెడ్డికి మధ్య ఉన్న విభేదాలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని అమిత్‌షా భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. రాజగోపాల్‌రెడ్డి సైతం కొన్నాళ్లుగా కాంగ్రెస్‌ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అటు రేవంత్‌రెడ్డితో ముందునుంచీ పొసగట్లేదు. అనేకసార్లు బహిరంగంగానే విమర్శలు చేశారు. నల్లగొండ జిల్లాలో రేవంత్‌రెడ్డి సభ పెట్టకుండా ప్రయత్నించడం వంటి పరిణామాలు.. తాను కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలిచ్చినట్టు అయింది. దీనిని బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తోంది.

రాజగోపాల్‌రెడ్డిని అడ్డం పెట్టుకొని కేసీఆర్‌ను, రాష్ట్ర రాజకీయాలకు పరిమితం చేసేలా అమిత్‌షా వ్యూహం పన్నినట్టు సమాచారం. ఆఎత్తుగడలో భాగంగానే మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఆగస్టు 30 లోగా రాజీనామా చేయాలని రాజగోపాల్‌కు అమిత్‌షా సూచించినట్టు తెలిసింది. ఈ ఏడాది చివరిలోగా.. ఉపఎన్నిక వచ్చేలా చేస్తామని.. ఆ ఎన్నికలో తిరిగి గెలిపించే బాధ్యత తనదని అమిత్‌షా హామీ ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం.

ఈఏడాది చివర్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతోపాటు ఉపఎన్నిక నిర్వహించే అవకాశం ఉంటుందని చెప్పినట్టు సమాచారం. గతఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే అధిక మెజార్టీ తెప్పిస్తానని బలంగా చెప్పినట్టు సమాచారం. ఇక జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడం లేట్ అవ్వచ్చేమో గానీ.. వెళ్లడం మాత్రం పక్కా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ సస్పెన్స్ కు ఆయన ఎప్పుడు తెరదించుతారో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story