CONGRESS: మళ్లీ కాంగ్రెస్‌ గూటికి రాజగోపాల్‌రెడ్డి!

CONGRESS: మళ్లీ కాంగ్రెస్‌ గూటికి రాజగోపాల్‌రెడ్డి!
ఊపందుకున్న ఊహాగానాలు... 26 లేదా 27 హస్తం పార్టీలో చేరతారంటూ ప్రచారం

బీజేపీ నేత, మాజీ MLA కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మళ్లీ కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే అధికారికంగా నిర్ణయం ప్రకటించే సూచనలున్నాయి. కొంతకాలంగా బీజేపీలో అసంతృప్తిగా ఉన్న రాజగోపాల్‌... ఈ నెల 26న లేదంటే 27వ తేదీన రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకునే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఊపు మీదున్న కాంగ్రెస్‌లోకి నేతల చేరికలు కొనసాగుతున్నాయి. గతేడాది కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సొంత గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. రాజగోపాల్‌ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరుతారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నా ఆయన ఖండిస్తూ వచ్చారు. కానీ, ఇటీవల సాగుతున్న ప్రచారంపై స్పందించిన ఆయన మునుగోడు ప్రజలు అభిప్రాయం మేరకు నడుచుకుంటానని చెబుతుండటంతో తిరిగి కాంగ్రెస్‌లో చేరటం దాదాపు ఖరారైనట్లేనని తెలుస్తోంది. పార్టీలో చేరికకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్‌ పెద్దలతో సంప్రదింపులు జరిపిన రాజగోపాల్‌రెడ్డి... ఈ నెల 26న లేదంటే 27వ తేదీన కాంగ్రెస్‌ కండువా కప్పుకునే అవకాశం ఉంది.


బీజేపీలో చేరిన తర్వాత వచ్చిన మునుగోడు ఉపఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి చేతిలో ఓడిపోయిన రాజగోపాల్‌రెడ్డికి. కమలం పార్టీలో ఆశించిన ప్రాధాన్యత దక్కలేదని అసంతృప్తితో ఉన్నారు. బీజేపీలో పరిస్థితులపై ఆయన బహిరంగంగా సైతం ప్రతికూల వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అప్పుడే ఆయన సొంతగూటికి చేరుతారని ప్రచారం జరగటంతో బీజేపీ అధిష్ఠానం నచ్చజెప్పి, పార్టీలో పదవులు కట్టబెట్టింది. అయినప్పటికీ అసంతృప్తితోనే ఉన్న రాజగోపాల్‌ మునుగోడుకు చెందిన తన అనుచరులతో చర్చించి తిరిగి కాంగ్రెస్‌లోకి వెళ్తే ఏలా ఉంటుందని అభిప్రాయాలు సైతం తీసుకున్నట్లు తెలుస్తోంది.

గత మూడ్నాలుగు రోజులుగా కాంగ్రెస్‌ పెద్దలతో భేటీ అవుతూ తన రాజకీయ భవిష్యత్తు గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశమై చర్చించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా... ఆయన సైతం పచ్చజెండా ఊపినట్టు కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రాజగోపాల్‌ చేరిక వరకు సుముఖత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్‌ సీటు విషయంలో స్పష్టత ఇవ్వలేదని, రెండ్రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే మునుగోడులో చెలమల కృష్ణారెడ్డి, ఉప ఎన్నికల్లో ఓటిమి చెందిన పాల్వాయి స్రవంతి టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. వారిద్దరి టికెట్లపై పీఠముడి నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story