Komuravelle: వైభవంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం..

Komuravelle: వైభవంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం..
పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన మంత్రులు...అమ్మవార్లకు బంగారు కిరీటాలు అందజేత

సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో కోరమీసాల కొమురవెల్లి మలన్న కల్యాణం అంగరంగ వైభవంగా సాగింది. బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలతో శోభాయమానంగా మల్లికార్జునిడి వివాహం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌లు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మల్లన్న కల్యాణాన్ని వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో మూడు నెలల పాటు జరిగే మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు..మల్లన్న కల్యాణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. కల్యాణోత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున దిష్టి కుంభం కార్యక్రమాన్ని నిర్వహించారు. వీర‌శైవ ఆగ‌మ విధానంలో 200 కిలోల బియ్యంతో వండిన అన్నాన్ని..మ‌హా మండ‌పంలో దిష్టికుంభం నిర్వహించారు.


అనంతరం..వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం మల్లికార్జున స్వామి..బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలను వివాహమాడారు . వధువుల తరఫున మహాదేవుని వంశస్థులు కన్యాదానం చేయగా.. వరుడి తరుపున పడిగన్నగారి వంశస్థులు కన్యాదానం స్వీకరించారు. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని పీఠాధిపతి సిద్ధలింగ రాజ దేశీ కేంద్ర శివాచార్యు మహాస్వామి పర్యవేక్షణలో స్వామి వారి కల్యాణం వైభవంగా జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ లు.. స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మాజీ మంత్రి మల్లా రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ రోజా శర్మతో పాటు పలువురు ప్రముఖులు, వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. మల్లన్న ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రంగా భారీ ఏర్పాట్లు చేసిందని మంత్రి కొండా సురేఖ వివరించారు. ఆలయ పరిసరాల్లో 4 చోట్ల వాహనాల పార్కింగ్‌, స్నాన ఘట్టాలు సిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా...భారీగా పోలీసులు మొహరించారు. కల్యాణం తర్వాత భక్తులంతా ఒక్కసారిగా కళ్యాణ వేదికపైకి తోసుకురాగా..పోలీసులు వారిని వారించారు.


మల్లన్న కల్యాణం నేపథ్యంలో ఆలయాన్ని, రాజగోపురాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాజగోపురం నుంచి తోటబావి వరకు పందిళ్లు వేసి ముస్తాబు చేశారు. కల్యాణ మండపంలో వీవీఐపీలు, వీఐపీ, దాతలు, భక్తుల కోసం ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు మహదేవుడి మల్లికార్జున్ ఇంట్లో వీరభద్రుని ఖడ్గం, పళ్లేరానికి ప్రత్యేక పూజలు చేసి రతి బియ్యం సేకరించారు. సాయంత్రం ఏడు గంటలకు మల్లికార్జున స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది.

Tags

Read MoreRead Less
Next Story