SUREKHA: కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు

SUREKHA: కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు
X
పైసలు తీసుకునే మంత్రులు ఫైల్స్ క్లియర్ చేస్తారన్న మంత్రి

తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. " ఫైళ్ల క్లియరెన్స్‌కు మంత్రులు మామూలుగా డబ్బులు తీసుకుంటారు.. నేను మాత్రం.. కాలేజీ భవనం కట్టాలని కోరా.." అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. వరంగల్‌లోని కృష్ణ కాలనీ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల ఆవరణలో రూ.5 కోట్ల సీఎస్ఆర్‌ నిధులతో అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ నిర్మించిన నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమంలో కొండా సురేఖ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో కలకలం రేగింది.

సురేఖకు అభినందనలు: కేటీఆర్

మంత్రి కొండా సురేఖకు మాజీ మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. మంత్రులు కమిషన్లు తీసుకోకుండా ఏ పనిచేయరంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌ స్పందించారు. ‘ఇప్పటికైనా కొన్ని నిజాలు బయట పెట్టినందుకు మంత్రి కొండా సురేఖకు నా హృదయపూర్వక అభినందనలు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ‘కమీషన్ సర్కార్’గా మారిపోయింది. ఇది రహస్యమే కాదు. ఓపెన్ సీక్రెట్." అని కేటీఆర్ ట్వీట్ లో పేర్కొన్నారు. కొండా సురేఖ కమిషన్లు తీసుకుంటున్న మంత్రుల వివరాల్ని బయటపెట్టాలని... ప్రజల ముందు బహిర్ఘతం చేయాలని కేటీఆర్ కోరారు. ఇదే అంశంపై రాహుల్‌ గాంధీ,రేవంత్‌రెడ్డి వారి సొంత కేబినెట్‌ మంత్రి చేసిన ఆరోపణలపై మీరు దర్యాప్తుకు ఆదేశించగలరా?’అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

వక్రీకరించారు: కొండా సురేఖ

తన వ్యాఖ్యలు కలకలం సృష్టించడంతో కొండా సురేఖ వివరణ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. ఇలా తప్పుడు ప్రచారం చేయడం సహేతుకం కాదని చెప్పారు. ఏ పనికైనా అప్పటి మంత్రులు డబ్బులు తీసుకునేవారని అన్నానని తెలిపారు.

Tags

Next Story