REVANTH: మ‌హిళా విశ్వవిద్యాల‌యానికి చాక‌లి ఐల‌మ్మ పేరు

REVANTH: మ‌హిళా విశ్వవిద్యాల‌యానికి చాక‌లి ఐల‌మ్మ పేరు
X
వెల్లడించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి... మహిళా కమిషన్ సభ్యురాలిగా ఐలమ్మ మనుమరాలు

కోఠి మ‌హిళా విశ్వవిద్యాల‌యానికి చాక‌లి ఐల‌మ్మ పేరు పెట్టాల‌ని నిర్ణయించిన‌ట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ర‌వీంద్ర భార‌తిలో నిర్వహించిన చాక‌లి ఐల‌మ్మ 39వ వ‌ర్ధంతి కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొని ఆమెకు నివాళుల‌ర్పించారు. చాకలి ఐలమ్మ మనుమరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంద‌ని సీఎం తెలిపారు. ఐలమ్మ కుటుంబ సభ్యులు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండాలని తమ ప్రభుత్వం భావిస్తోందన్నారు. పోరాటస్ఫూర్తి కలిగిన వాళ్లు ప్రజా ప్రభుత్వానికి అవసరమని స్పష్టం చేశారు. తెలంగాణలో ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగిస్తామని.. భూస్వాముల చేతుల్లో ఉన్న వేలాది ఎకరాలను పేదలకు చేరాలని ఐలమ్మ పోరాటం చేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే...

చాకలి ఐలమ్మ స్పూర్తితో ఇందిరాగాంధీ భూసంస్కరణలు తీసుకొచ్చారని రేవంత్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పేరుతో పేదల భూములను గుంజుకునే ప్రయత్నం చేశారని రేవంత్‌ ఆరోపించారు. ఐలమ్మ కుటుంబ సభ్యులు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండాలని తమ ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. తెలంగాణలో ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. దొరల చేతుల్లో ఉన్న వేలాది ఎకరాలను పేదలకు చేరాలని ఐలమ్మ పోరాటం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. భూమి పేదవాడి ఆత్మగౌరవం.. అందుకే ఇందిరమ్మ పేదలకు లక్షల ఎకరాలను పంచిపెట్టారని ఉద్ఘాటించారు. పేదల భూములను కాపాడేందుకే ఐలమ్మ స్పూర్తితో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

తెలంగాణలో లక్షలాది పేదవారి కుటుంబాలకు భూమి ఉందంటే ఆ భూ హక్కును ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని రేవంత్‌ అన్నారు. అప్పట్లో ఇందిరా గాంధీ తీసుకొచ్చిన భూ సంస్కరణలను పీవీ నరసింహరావు అమలు చేశారని గుర్తు చేశారు. ధరణి పేరుతో పేదలకు ఇచ్చిన భూములను లాక్కోవాలనే కుట్రలను, రైతాంగ పోరాట స్ఫూర్తితో తిప్పికొట్టామని తెలిపారు. ఆనాటి సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ స్పూర్తి మా అందరిలో ఉందని రేవంత్‌ తెలిపారు.

Tags

Next Story