kotta prabhakar reddy : రఘునందన్ రావును ఢీకొట్టేందుకు రంగంలోకి కొత్త ప్రభాకర్ రెడ్డి?

kotta prabhakar reddy : రఘునందన్ రావును ఢీకొట్టేందుకు రంగంలోకి  కొత్త ప్రభాకర్ రెడ్డి?
Kotta Prabhakar Reddy : ఎమ్మెల్యే కావాలన్న లక్ష్యంతో నియోజకవర్గంలో బలంగా పని చేశారు కొత్త ప్రభాకర్ రెడ్డి. కానీ 2014లో చివరి క్షణంలో అవకాశం చేజారింది.

kotta prabhakar reddy : సొంత ప్రాంతంలో ఎమ్మెల్యే కావాలన్నది ఆ ఎంపి కలనా? గతంలో అవకాశం జస్ట్ మిస్సయిందా? ఈసారి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనే పట్టుదలతో ఉన్నారా? ఇంతకీ ఎవరా ఎంపి? ఏంటా కథ? ఎంపీని వద్దనుకుని ఎమ్మెల్యే కావాలనుకోవడం వెనుకున్న ఆ ఓపెన్ సీక్రెట్ ఏంటి?

ఎమ్మెల్యే కావాలన్న లక్ష్యంతో నియోజకవర్గంలో బలంగా పని చేశారు కొత్త ప్రభాకర్ రెడ్డి. కానీ 2014లో చివరి క్షణంలో అవకాశం చేజారింది. అయితే అద్రుష్టం మరో రూపంలో వచ్చింది. అదే సంవత్సరం మెదక్ పార్లమెంట్ స్థానికి వచ్చిన ఉప ఎన్నికల్లో విజయం సాధించి అనుకోకుండా ఎంపీ అయ్యారు కొత్త ప్రభాకర్ రెడ్డి. వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. ఇప్పుడు తన తీరని కల నెరవేర్చకునే పనిలో పడ్డారట ఆ ఎంపీ. అయితే పెద్దసారు కరుణిస్తే చాలు అనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది.

కొత్త ప్రభాకర్ రెడ్డి వరుసగా రెండుసార్లు మెదక్ ఎంపిగా భారీ మెజార్టీతో గెలిచారు. ఆయన స్వగ్రామం దుబ్బాక మండలం పోతారం. 2014కు ముందు దుబ్బాక అసెంబ్లీ టిక్కెటే టార్గెట్గా పని చేశారు. కానీ అప్పటికే అక్కడున్న మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి కారణంగా చివరిక్షణంలో అవకాశం చేజారింది. 2014లో గజ్వేల్ ఎమ్మెల్యేగానూ, మెదక్ ఎంపీగానూ సీఎం కెసిఆర్ పోటీ చేశారు. ఆ తరువాత మెదక్ ఎంపి స్థానానికి రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికల్లో కొత్త ప్రభాకర్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2018లోనూ అసెంబ్లీ వైపు చూసినా అవకాశం దక్కలేదు. 2019లో మరోసారి ఎంపీగా విజయం సాధించారు.

దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్న రామలింగారెడ్డి మృతితో వచ్చిన ఉప ఎన్నికల్లో రామలింగారెడ్డి సతీమణి సుజాతకు టిక్కెట్ ఇచ్చింది పార్టీ అధిష్టానం. ఆమె ఓటమిపాలు కాగా బీజేపీ నుంచి రఘునందన్ రావు విజయం సాధించారు. దీంతో ఈ స్థానం టిఆర్ఎస్ చేజారింది. అయితే ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాకపై ఫుల్ ఫోకస్ పెట్టారు. పార్టీ కార్యక్రమైనా... అభివృద్ధి కార్యక్రమమైనా... దుబ్బాకలో కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో ఆయనకు ప్రత్యేక వర్గముందట. ఇప్పుడు తన వర్గాన్ని బలోపేతం చేస్తూ... నాయకులందరినీ కలుపుకునిపోయే పనిలో పడ్డారట. దీనికి తోడు 2014కు ముందు తనకు సహకరించిన వారందిరినీ మళ్లీ యాక్టివ్ చేస్తున్నారట.

రఘునందన్ రావు బలమైన నాయకుడు కావడంతో ఆయనను ఢీకొట్టేందుకు ఈసారి కొత్త ప్రభాకర్ రెడ్డినే రంగంలోకి దించుతారని చెబుతున్నారు ఆ పార్టీ నాయకులు. అధిష్ఠానం సూచన మేరకే దుబ్బాక నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తున్నారని చెబుతున్నారు. దీనికితోడు నియోజకవర్గ అభివృద్ధిపైనా స్పెషల్ ఫోకస్ పెట్టారట. ప్రతి చిన్న సమస్యను స్వయంగా పరిశీలిస్తూ... ప్రతి కార్యకర్త ఇంటికీ వెళ్లుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈసారైనా ఎంపీగారి కల నెవరుతుందో లేదో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story