KTR : నేడు ఫార్ములా ఈ రేస్‌ కేసులో ఏసీబీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్‌

KTR : నేడు ఫార్ములా ఈ రేస్‌ కేసులో ఏసీబీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్‌
X
విచారణకు లాయర్‌ను తీసుకెళ్లేందుకు కోర్టు అనుమతి

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ ఏసీబీ ముందు విచారణకు హాజరవుతున్నారు. ఉదయం 9:30కి నంది నగర్ నివాసం నుంచి బయలుదేరి, 10 గంటలకు బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి చేరుకుంటారు. ఫార్ములా-ఈ కారు రేసుతో సంబంధం ఉన్న నిధుల దుర్వినియోగం ఆరోపణలపై కేటీఆర్‌ను ఏసీబీతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణకు పిలుస్తూ నోటీసులు జారీచేసింది.

ఈ ఆరోపణలపై ఇప్పటికే ఒకసారి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. అయితే, విచారణ సమయంలో లాయర్‌ను అనుమతించాలన్న ఆయన అభ్యర్థన ఏసీబీ నిరాకరించడంతో, అప్పట్లో విచారణ నిలిపివేశారు. ఈసారి, హైకోర్టు ఆదేశాల ప్రకారం, కేటీఆర్ లాయర్‌తో విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే, విచారణ గదిలో కేటీఆర్‌ను మాత్రమే అనుమతిస్తారు, లాయర్ మరో గదిలో ఉండవచ్చు. హైకోర్టు ఆడియో, వీడియో రికార్డింగ్‌ను అనుమతించనప్పటికీ, లాయర్ వెంట ఉండటం కేటీఆర్‌కు వ్యూహాత్మకంగా సహాయపడే అవకాశం ఉంది.

దీనితోపాటు, కేటీఆర్ విచారణ తర్వాత అరెస్టు చేయబడతారనే ప్రచారం జరుగుతుండగా, ఈ వాదనను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది.

ఇదే సమయంలో, మాజీ మంత్రి హరీశ్ రావును గృహ నిర్బంధం చేశారు. హరీశ్ రావు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ రోజు కేటీఆర్‌తోపాటు ఆయన లాయర్ రామచంద్రరావు కూడా విచారణకు హాజరవుతారని సమాచారం.

Tags

Next Story