KTR Bulk Drug Park : ఇప్పటికైనా కేంద్రం తెలంగాణకు బల్క్ డ్రగ్ పార్క్ కేటాయించాలి : కేటీఆర్

KTR Bulk Drug Park : ఇప్పటికైనా కేంద్రం తెలంగాణకు బల్క్ డ్రగ్ పార్క్ కేటాయించాలి : కేటీఆర్
KTR Bulk Drug Park : కేంద్ర బీజేపీపై మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు

KTR Bulk Drug Park : కేంద్ర బీజేపీపై మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్షపూరిత వైఖరి కొనసాగిస్తోందని ఆరోపించారు. కేంద్రం ప్రకటించిన బల్క్ డ్రగ్ పార్క్ పథకంలో తెలంగాణకు చోటు కల్పించకపోవడమే ఇందుకు సాక్ష్యమన్నారు. బల్క్ డ్రగ్ పార్కుల కేటాయింపులో తెలంగాణకు జరిగిన తీవ్ర అన్యాయాన్ని ఎత్తిచూపుతూ కేంద్ర కెమికల్, ఫెర్టిలైజర్ శాఖమంత్రి మాండవియాకు కేటీఆర్ లేఖ రాశారు.

లైఫ్ సైన్సెస్-ఫార్మా రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న హైదరాబాద్‌ను కావాలనే మోదీ సర్కారు విస్మరించిందని విమర్శించారు.బల్క్ డ్రగ్ పరిశ్రమ ఏర్పాటుకు ఏపీ, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌ రాష్ట్రాలను ఎంపిక చేయడం కేంద్రం కక్ష రాజకీయాలకు పరాకాష్ట అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ప్రభుత్వం నెలకొల్పుతున్న హైదరాబాద్ ఫార్మాసిటీ పేరును కనీసం పరిశీలించకపోవడంపై మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

బల్క్‌ డ్రగ్ పార్క్‌ను తెలంగాణకు కేటాయించాలని కేంద్ర ఫార్మా సూటికల్ శాఖకు తెలంగాణ ప్రభుత్వం తరపున పంపిన ప్రతిపాదనలను మంత్రి కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్‌ ఫార్మాసిటీలోని 2 వేల ఎకరాల్లో డ్రగ్ పార్క్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రానికి తెలిపామన్నారు. దానికి సంబంధించిన ఫార్మాసిటీ మాస్టర్ ప్లాన్‌ను కూడా అందజేశామని తెలిపారు.

అలాగే కీలకమైన భూసేకరణ, పర్యావరణ అనుమతులతో పాటు ఫార్మాసిటీకి ఉన్న సానుకూల అంశాలను వివరిస్తూ కేంద్రానికి సమగ్రమైన నివేదిక కూడా ఇచ్చామని గుర్తుచేశారు. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం వెంటనే తెలంగాణకు బల్క్ డ్రగ్ పార్క్ కేటాయించాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story