KTR: లేని రంకును అంటగట్టారు: కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డిపై అసెంబ్లీ సాక్షిగా మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మీద లేనిపోని రంకులు అంటగట్టారని.. తన కుటుంబాన్ని నిందించారన్నారు. ఆ సమయంలో చిన్న పిల్లోడైన తన కుమారుడు హిమాన్షుపై కూడా ఇష్టానుసారం మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. మీ ఇంట్లో వాళ్లే ఆడవాళ్లు.. మా ఇంట్లో వాళ్లు కారా? ’ అని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ ను జైలుకు పంపింది తాము కాదని.. కోర్టులు పంపాయన్నారు. సీఎం రేవంత్ జైలుకు వెళ్లిన సందర్భాన్ని గుర్తు చేయగా కేటీఆర్ స్పందిస్తూ 'నువ్వు ఏమైనా స్వాతంత్ర ఉద్యమం చేసి జైలుకు పోయావా. నీ ఇంటి మీదకి డ్రోన్ పంపిస్తే ఊరుకుంటావా.. అక్కడ నీ బిడ్డనో, భార్యనో ఉంటే వాళ్ళను ఇష్టం ఉన్నటు ఫొటో తీస్తే ఊరుకుంటావా. మీకే కుటుంబాలు, భార్యాపిల్లలు ఉంటారా? వేరే వాళ్లకు భార్యాపిల్లలు లేరా.' అని కేటీఆర్ ప్రశ్నించారు.
మీరు గ్రేట్ భట్టి అన్న
సభ నడుస్తుండగా కేటీఆర్ మాట్లాడుతూ.. సభలో అప్పులు లేనివాళ్లు ఉన్నారా? అని ప్రశ్నించారు. దీనికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందిస్తూ.. తనకు అప్పులేదని సమాధానమిచ్చారు. మీరు గ్రేట్ భట్టి అన్నా.. ఆర్థికమంత్రి కదా అలాగే ఉండాలని కేటీఆర్ సరదాగా అన్నారు. దీంతో సభలో నవ్వులు పూశాయి.
బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ అప్పులే ఎక్కువ
'గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏడాది కేవలం రూ.41 వేల కోట్లు అప్పు చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి రూ.1.50 లక్ష కోట్లు అప్పు చేస్తుంది. అలాగే 2041లో రీచ్ కావాల్సిన ITIRను తెలంగాణ 2022లోనే దాటింది. దేశాన్ని పోషిస్తున్న రాష్ట్రాల్లో టాప్ 5లో తెలంగాణ ఉండటం గర్వకారణం' అన్నారు కేటీఆర్.
బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం
తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేశామని మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. ‘తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశాం. పదేళ్ల పాలనలో తెలంగాణ అభివృద్దిలో దూసుకుపోయింది. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగింది. కానీ.. తెలంగాణ బడ్జెట్‌లో ఆ ప్రస్తావన లేదు’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com