KTR: ఎదుర్కొనే దమ్ములేక కుట్రలు: కేటీఆర్

KTR: ఎదుర్కొనే దమ్ములేక కుట్రలు: కేటీఆర్
X
జన్వాడ ఫామ్‌హౌస్‌ పార్టీ కేసులో రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం... తమ కుటుంబంపై కుట్రలు చేస్తున్నారని మండిపాటు

జన్వాడ ఫామ్‌హౌస్‌ పార్టీ కేసులో సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దావత్ చేసుకుంటే తప్పా అని ప్రశ్నించారు. నందినగర్‌లోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్... కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్‌రెడ్డి కావాలనే తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వరుస వైఫల్యాలు చెందిందని విమర్శించారు. జన్వాడ ఫామ్‌ హౌస్‌ కేసు ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. 14 మందిలో ఒక్కరికి పాజిటివ్ వచ్చిందని చెబుతున్నారని, అతడు ఎక్కడ డ్రగ్స్ తీసుకున్నాడో తేల్చాలన్నారు. ఉదయం మద్యం సీసాలు ఎక్కువ దొరికాయని ఎక్సైజ్ కేసు అన్నారు. అది సాయంత్రానికి డ్రగ్స్ కేసుగా మారిపోయిందని, తనను, తన పార్టీని ఎదుర్కొనే ధైర్యం లేకనే ఈ కుట్రలు చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


పోరాటం కొనసాగుతుంది..

ఇచ్చిన ఆరు గ్యారెంటీలను రేవంత్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదని కేటీఆర్ ప్రశ్నించారు. 11 నెలల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. 11 నెలల కాంగ్రెస్‌ వైఫల్యాలను బయటపెడుతున్నామని.. తమపై కక్ష సాధింపులకు దిగుతుున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా తమను ఎదుర్కొలేకపోతున్నారని అన్నారు. తమ ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

అంతా అసత్య ప్రచారం...

రేవ్ పార్టీ అని అసత్య ప్రచారం చేస్తున్నారని.. అసలు రేవ్ పార్టీ అర్ధం తెలుసా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆ పార్టీలో మా బామ్మర్ధి అమ్మ, చిన్న పిల్లలు ఉన్నారని... ఆ పార్టీలో ఉన్నది పురుషులు,మహిళలు కాదు. భార్యా,భర్తలు ఆ పార్టీలో ఉన్నారని కేటీఆర్ అన్నారు. చివరకు కొండను తవ్వి ఎలుకను పట్టారన్నారు. అక్కడ డ్రగ్స్ లేవని ఇన్స్పెక్టర్ చెప్పారని కేటీఆర్ తెలిపారు. డ్రగ్స్ దొరకకుండా కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. తనను, పార్టీని ఎదుర్కొలేక మా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని అన్నారు. బాంబులు అంటే ఏదో అనుకున్నా. నేను అక్కడే ఉన్నానని కొన్ని ప్రసార మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. తాను తమ పార్టీ అధినేతను కలిసి వచ్చానని తెలిపారు. తనపైన, తన భార్యపైన, కుటుంబ సభ్యులపైన ఇష్టం వచ్చినట్లు వార్తలు రాయవచ్చా అని ప్రశ్నించారు. మీరు జైళ్లకు పంపినా, ఎక్కడికి పంపినా ఉద్యమ బాటలో నడుస్తామని... తెలంగాణలో పోలీసులు పోలీసులను కొడుతున్న పరిస్థితిని చూస్తున్నామన్నారు.

Tags

Next Story