ప్రతిపక్షాలకు కేటీఆర్ రివర్స్ కౌంటర్

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలతో కలవరన్న ప్రతిపక్షాల విమర్శలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. సీఎం ఏనాడైనా ప్రజలను కలిశారా అంటూ విపక్షాలు చేసే ఆరోపణలను కేసీఆర్ వద్ద ప్రస్తావించగా ప్రజాదర్బార్ అవసరమేంటని గట్టి సమాధానమిచ్చారని అన్నారు. మాదాపూర్ హైటెక్స్‌లో నూతన వార్డు కార్యాలయాల వ్యవస్థ సన్నాహక సమావేశంలో ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టారు. రాష్ట్రంలో 6.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఎమ్మెల్యేలు, సర్పంచ్‌లు, కౌన్సిలర్ల వంటి ప్రజాప్రతినిధులు ఉన్నారని తెలిపారు. ఇంత మంది ఉన్నా పింఛను, రేషన్ కార్డు, మోరీ, నల్లా, పాస్‌బుక్.. ఇలా అనేక సమస్యలపై సీఎంకు ఫిర్యాదు చేయడమంటే.. ప్రభుత్వ వ్యవస్థల పనితీరు సరిగా లేనట్టేనని చెప్పారు. ఇంతమంది ఉండగా అన్నింటికి సీఎం రావాల్సిన పనిలేదని.. ప్రజాదర్బార్ ప్రజా ఆర్భాటమే తప్ప దాని వల్ల ఒరిగేదేమి లేదనేది కేసీఆర్ వైఖరి అని అన్నారు. గ్రామస్థాయి నుంచి నగరాలస్థాయి వరకు ఆయా సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కారం అవ్వాలని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com