KTR: లోకేష్‌తో అర్ధరాత్రి కేటీఆర్ చర్చలు..!

కేసీఆర్ కుటుంబంలో నాయకత్వంపై గొడవ జరుగుతుందని.. కేటీఆర్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి కేసీఆర్ ఎందుకు ఒప్పుకోవటం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవితకు.. ఆమె ఇంట్లోనే విలువ లేదని.. చెల్లి కవితనే కేటీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకోవటం లేదని వ్యాఖ్యానించారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంటో... స్లీపింగ్ ప్రెసిడెంటో తనకు తెలీదని ఎద్దేవా చేశారు. కొందరు సూసైడల్ టెండెన్స్ తో బాధపడుతున్నారంటూ రేవంత్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో జరిగిన సమావేశాల అనంతరం మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. పలు అంశాలపై స్పష్టత ఇచ్చారు. తన పాలనపై విమర్శలు చేసే ప్రత్యర్థులపై సూటిగా వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై ఘాటైన పదజాలంతో ప్రస్తావించారు.
లోకేశ్‌తో రహస్య భేటీ
కేటీఆర్.. ఏపీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ ను అర్థరాత్రి సమయంలో మూడు సార్లు ఎందుకు కలిశాడంటూ కేటీఆర్ ను రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. రహస్యంగా కలవాల్సిన అవసరం ఏంటని.. అర్థరాత్రి లోకేష్ తో డిన్నర్ మీటింగ్ ఎందుకు అని.. లోకేష్ ను చీకట్లో కలవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. వాళ్లలాగ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. కేసీఆర్ ను కాపాడేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాపత్రయ పడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అధికారికంగా పిలిస్తే కేంద్రంతో చర్చించటానికి.. సమీక్షలకు వెళతానని.. రాష్ట్ర భవిష్యత్ కోసం కేంద్రంతో కలిసి పని చేస్తామని వివరించారు.
కేంద్రంతో చర్చలు జరపకపోతే ఎలా..?
“కేంద్రంతో చర్చలు జరుపకుంటే సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి?” అని ప్రశ్నించారు సీఎం. రాష్ట్రానికి సంబంధించి పలు ముఖ్యమైన అంశాలను ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చర్చించామని తెలిపారు. ఇండియా, పాకిస్తాన్ మధ్యే నీటి పంపిణీపై చర్చలు జరుగుతుంటే, నేను పక్క రాష్ట్రం సీఎంతో మాట్లాడితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖ ఎలాంటి చర్చలు జరగలేదని ప్రకటించిందని సీఎం తెలిపారు. అయితే, తాను ఇప్పటికే మూడు సమస్యలను పరిష్కరించానని పేర్కొన్నారు. “ప్రజలు నాకు అధికారం ఇచ్చారు.. రాష్ట్ర సమస్యలను కేంద్రానికి తీసుకెళ్లడం నా బాధ్యత” అని సీఎం స్పష్టం చేశారు. ఢిల్లీకి కాకుండా ఫామ్ హౌస్‌కు వెళ్తే సమస్యలు పరిష్కారం కావు అని పరోక్షంగా కేసీఆర్‌పై విమర్శలు చేశారు. నెలకు ఖచ్చితంగా రెండు సార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులతో సమన్వయం చేసుకుంటానని హామీ ఇచ్చారు. సమస్యలపై అధికారులు, సాంకేతిక నిపుణుల కమిటీ చర్చిస్తుందని వివరించారు. “నేను ఇంజనీర్ కాదు… సాంకేతిక అధ్యయనం తర్వాతే నిర్ణయం తీసుకుంటాం” అని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com