KTR: ఫోన్ ట్యాపింగ్ చేయడం తప్పేం కాదు

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ జారీ చేసిన నోటీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు సిరిసిల్లలో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ ప్రజల దృష్టిని మళ్లించేందుకే అని విమర్శించారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరుసగా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
సిట్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, “ఇది అసలు స్వతంత్ర దర్యాప్తు కాదు. ఇది రేవంత్‌రెడ్డి సిట్. ఆయన కూర్చోమంటే కూర్చుంటుంది, నిలబడమంటే నిలబడుతుంది” అంటూ ఎద్దేవా చేశారు. గత కొంతకాలంగా ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి కొన్ని రోజులు హడావుడి చేసి తర్వాత వదిలేయడం ప్రభుత్వానికి అలవాటైందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కొన్ని రోజులు డ్రామా జరిగిందని, ఆ తర్వాత కార్ రేసు అంశం, గొర్రెల స్కామ్, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటూ వరుసగా కథనాలు మారుతున్నాయని అన్నారు. వీటన్నింటిలోనూ అసలు విషయమే లేదని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. సింగరేణి కుంభకోణాన్ని బయటపెట్టిన కారణంగానే తనకు, హరీశ్‌రావుకు నోటీసులు వచ్చాయని కేటీఆర్ ఆరోపించారు. ఉదయం ఒక స్కామ్ బయటపెడితే, సాయంత్రానికి సిట్ నోటీసులు అందుతున్నాయంటే అది స్పష్టమైన రాజకీయ ప్రతీకారమేనని అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేటీఆర్ విస్తృతంగా స్పందించారు. దేశ భద్రత, ప్రజల భద్రత కోసమే నిఘా వ్యవస్థలు పనిచేస్తాయని, ఇది నెహ్రూ కాలం నుంచి కొనసాగుతున్న విధానమని గుర్తు చేశారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు జరిగితే వాటిని అడ్డుకోవడం కోసం పోలీసులు నిఘా పెట్టడం సహజమేనని అన్నారు. అలాంటప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఎలా నేరమవుతుందని ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు లేదా ప్రభుత్వాలు నేరుగా ఫోన్ ట్యాపింగ్ చేయవని, పోలీసు వ్యవస్థ పరిధిలోనే ఇది జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి అవసరమైన సమాచారాన్ని సేకరించడంలో భాగంగానే పోలీసులు ఈ విధానాన్ని ఉపయోగిస్తారని చెప్పారు.
ఈ మొత్తం కేసును “పూర్తిగా ట్రాష్ కేసు”గా అభివర్ణించిన కేటీఆర్, ఇందులో ఎలాంటి అంశమూ లేదని కొట్టిపారేశారు. అసలు ఈ వ్యవహారంలో ముందుగా విచారించాల్సింది ప్రస్తుత డీజీపీ శివధర్రెడ్డినేనని అన్నారు. ఆయనను వదిలేసి తమను పిలిస్తే ఏమి తేలుతుందని ప్రశ్నించారు. అంతేకాదు, ప్రస్తుతం ప్రతిపక్ష నేతల ఫోన్లను కూడా ప్రభుత్వం ట్యాప్ చేయిస్తోందని ఆరోపించారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులందరినీ జైలుకు పంపుతామని హెచ్చరించారు.సిట్ విచారణకు తప్పకుండా హాజరవుతానని కేటీఆర్ స్పష్టం చేశారు. తాము ఏ తప్పూ చేయలేదని, ఎవరికీ భయపడే అవసరం లేదని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
