KTR: పేదల పథకాలపై ప్రధానికి అంత అక్కసెందుకు..? - కేటీఆర్‌

KTR: పేదల పథకాలపై ప్రధానికి అంత అక్కసెందుకు..? - కేటీఆర్‌
KTR: ఉచిత పథకాలు వద్దంటూ ప్రధానమంత్రి మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు.

KTR: ఉచిత పథకాలు వద్దంటూ ప్రధానమంత్రి మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. ఈ మేరకు ప్రతికా ప్రకటన విడుదల చేశారు. పేదల సంక్షేమ పథకాలపై ఎందుకంత అక్కంటూ ప్రధానిపై ధ్వజమెత్తారు. అసలు ప్రధాని దృష్టిలో ఉచితాలంటే ఏమిటంటూ ప్రశ్నించారు. పేదలకు ఇస్తే ఉచితాలు, పెద్దలకు ఇస్తే ప్రోత్సాహకాలా? అని విమర్శించారు. కాకులను కొట్టి గద్దలకు వేయడమే మోదీ విధానమా? రైతు రుణమాఫీ చేదు, కార్పొరేట్‌ రుణమాఫీ ముద్దా?.. అని ఆరోపించారు. నిత్యావసరాల మీద జీఎస్టీ బాదే కేంద్రం.. కార్పొరేట్‌కు పన్నురాయితీ కల్పించడాన్ని కేటీఆర్‌ నిలదీశారు.

మోదీకి ముందున్న 14 మంది ప్రధానులు కలిపి 56 లక్షల కోట్ల అప్పు చేస్తే మోదీ ప్రభుత్వం ఏకంగా రూ.80లక్షలకోట్ల అప్పు చేశారని కేటీఆర్‌ మండిపడ్డారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అడ్డూ అదుపూ లేకుండా చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే దేశ వార్షిక రాబడిలో 37 శాతం ఖర్చవుతున్నదని కాగా తీవ్రంగా హెచ్చరించిన విషయాన్ని కేటీఆర్‌ గుర్తుచేశారు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం.. జీడీపీలో 40శాతానికి మించి అప్పులు చేయకూడదని, దీన్ని తుంగలో తొక్కి మోదీ సర్కార్‌ ఇప్పటికే 54 శాతం అప్పులు చేసిందని కాంగ్‌ తలంటిందని చెప్పారు.

మరి ఇంత సొమ్ము అప్పుగా తెచ్చి మోదీ.. ఏ వర్గాల ప్రయోజనాల కోసం ఖర్చుచేయారో చెప్పాలని కేటీఆర్‌ ప్రశ్నించారు. దేశ సంపదను పెంచే తెలివి మోదీ ప్రభుత్వానికి లేదని, సంపద పెంచి పేదల సంక్షేమానికి ఖర్చు చేసే మనసు లేదన్నారు. ఓ వైపు పాలు, పెరుగులాంటి నిత్యావసరాలపై జీఎస్టీ పెంచి కేంద్రం ప్రజల రక్తాన్ని జలగల్లా జుర్రుకుంటోందని, మరో వైపు పేదల నోటికాడి ముద్ద లాగేసే దుర్మార్గానికి తెగించిందంటూ కేటీఆర్‌ మండిపడ్డారు. ఎనిమిదేళ్ల పాలనలో దేశంలో పేదరికం పెచ్చుమీరిందని, నైజీరియా కన్నా ఎక్కువమంది పేదలున్న దేశంగా అపకీర్తి గడించామన్నారు.

ఆకలి సూచీలో నానాటికి దిగజారి 116 దేశాల్లో 101వ స్థానానికి చేరుకున్నామని, దేశంలో పుట్టిన పిల్లల్లో 35.5శాతం పోషకాహార లోపంతో పెరుగుదల సరిగాలేదని కేంద్రం విడుదలచేసిన గణాంకాలే స్పష్టం చేస్తున్నాయన్నారు. పేద రైతన్నకు రుణమాఫీ చేస్తే ఉచితాలు తప్పు అని ఘోషించే ప్రధాని మోదీ.. అదే సమయంలో కార్పొరేట్‌ పెద్దలకు మాత్రం అందినకాడికి దోచిపెడుతున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. గత మూడేళ్లలోనే మూడు లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్‌ ట్యాక్స్‌ రాయితీలు ఇచ్చిన ఘటన మోదీ ప్రభుత్వానిదన్నారు.

బడా బాబులకు పది లక్షల కోట్లకు పైగా బ్యాంకు అప్పులు సైలెంటుగా రైట్‌ ఆఫ్‌ చేసిన కేంద్ర ప్రభుత్వం.. చిన్న, సన్నకారు రైతుల అప్పుల విషయానికి వచ్చేసరికి స్వరం మారిపోతోందని విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమానికి చేపట్టిన మధ్యాహ్న ఉచిత భోజనం, ఆరోగ్యలక్ష్మి, అమ్మబడి, మిషన్‌ భగీరథ, నేతన్నకు చేయూత, నేతన్నకు భీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌, దళితబంధు వంటి పలు పథకాలు వృథా ఖర్చులుగా మోదీకి కనిపిస్తున్నాయని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.

Tags

Read MoreRead Less
Next Story