KTR: ప్రజా పండుగలా బీఆర్ఎస్ రజతోత్సవం: కేటీఆర్

భారత రాష్ట్ర సమితి రజతోత్సవాలను ప్రజా పండుగలా నిర్వహిస్తామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఏర్పాటు కోసమే బీఆర్ఎస్ పార్టీ ఉద్భవించిందని వెల్లడించారు. తెలంగాణ ప్రజల ఆస్తిత్వాన్ని కాపాడేందుకు తమ పార్టీ ఎన్నో పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజల సంక్షేమమే ముఖ్యమని కేటీఆర్ పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రయోజనాలు బీఆర్ఎస్ తోనే సాధ్యమని అన్నారు. తెలంగాణలో ఉద్యమ సహచరులను ఏకం చేసి.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనలోనే.. తెలంగాణ సంక్షోభంలోకి వెళ్లిందని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే బాధ్యత బీఆర్ఎస్‌పై ఉందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలకు ఏ సమస్య వచ్చినా పోరాడేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
ప్రజా పోరాటంలో వెనక్కి తగ్గేదే లే
తెలంగాణకు ఏనాటికైనా బీఆర్ఎస్సే రక్షణగా నిలుస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజా పోరాటంలో వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్.. తమకు దిశా నిర్దేశం చేశారని కేటీఆర్ వెల్లడించారు. గతంలో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఎలా అవమానించిందో.. సమావేశంలో కేసీఆర్ గుర్తు చేశారని అన్నారు.
కృష్ణా జలాల వాటా కోసం పోరాడుతాం
కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కృష్ణా జలాల వాటాలను దక్కించుకునేందుకు త్వరలోనే కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని వెల్లడించారు. కృష్ణా జలాలను ఏపీ ప్రభుత్వం తరలించుకుపోతున్నా.. రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ రైతాంగానికి ఎలాంటి హానీ కలగనీయమని స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com