KTR : అందుకు కేంద్రం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే : కేటీఆర్

KTR : ప్రతిష్టాత్మక హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టు రద్దు చేయడాన్ని కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణపై బీజేపీ కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమన్నారు. హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీపై పార్లమెంట్ సాక్షిగా కేంద్రం పచ్చి అబద్దాలు చెప్పిందని ధ్వజమెత్తారు. ముందు నుంచి తెలంగాణ పట్ల మోదీ సర్కారు వివక్ష చూపుతోందని తీవ్రస్థాయిలో విమర్శించారు.
కేంద్ర బీజేపీకి ఎలాంటి ముందుచూపు లేకపోవడం వల్లే దేశంలో ఆర్థిక, సామాజిక సంక్షోభం అని ఆరోపించారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుకు సమానంగా తెలంగాణకు పథకాన్ని లేదా ప్యాకేజీని ప్రకటించాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి కేంద్ర బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేశామని పార్లమెంట్‌లో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన ప్రకటనను తీవ్రంగా తప్పుపట్టారు. కుటిల రాజకీయాల కోసం కేంద్ర ప్రభుత్వం ఐటీఐఆర్‌ను రద్దు చేసిందని ఆరోపించారు.
ఐటీఐఆర్ స్థాయిలో రాష్ట్రానికి పలు ప్రాజెక్టులను మంజూరు చేశామని పార్లమెంట్‌లో నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేసిందని ఫైర్ అయ్యారు. బీజేపీ పార్టీ డీఎన్ఏలో నిండి ఉన్న అసత్యాలు, అవాస్తవాలు, పచ్చి అబద్దాలను ఎప్పటిలాగే కేంద్రమంత్రి వల్లె వేశారని కేటీఆర్ విమర్శించారు.
రాజకీయంగా వారితో విభేదిస్తున్నామన్న కారణంతో ఐటిఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసి మోదీ ప్రభుత్వం.. తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు రద్దుతో హైదరాబాద్ ఐటీ పరిశ్రమ మరింత ఎదిగే అవకాశాన్ని కొల్పొయిందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ ఐటీ పరిశ్రమ సాధిస్తున్న ప్రగతికి కేంద్రం చేసిందేమి లేదని విమర్శించారు. 2008లో కేంద్రంలో అధికారంలో ఉన్న అప్పటి ప్రభుత్వం హైదరాబాద్ ఐటీఐఆర్ ఏర్పాటు ప్రతిపాదన చేసిందని గుర్తుచేశారు.
2013లో ఐటీఐఆర్ ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదం తెలిపినా 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు పక్కన పెట్టేసిందన్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు తాను కూడా వివిధ సందర్భాల్లో ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, కేంద్రమంత్రులను కలిసి ఐటీఐఆర్ ప్రాజెక్టు గురించి అడిగామని చెప్పారు. అయితే కేంద్ర బీజేపీని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదని తీవ్రస్థాయిలో విమర్శించారు మంత్రి కేటీఆర్.
ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసేందుకే మోదీ ప్రభుత్వం జాప్యం పేరుతో కాలయాపన చేసిందని ఆరోపించారు. కనీసం ఐటీఐఆర్‌కు సమానస్థాయిలో హైదరాబాద్ ఐటీకి అవసరమైన ఏదైనా పథకాన్ని ప్రకటించాలని కనీసం 50సార్లు కేంద్రాన్ని కోరమని తెలిపారు. అయినా కూడా మోదీ ప్రభుత్వం హైదరాబాద్ ఐటీ ఈకోసిస్టమ్‌కు నయా పైసా ఇవ్వలేదని విమర్శించారు.
కేంద్రానికి హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీ అభివృద్ధి పట్ల చిత్తశుద్ది లేకనే ఐటీఐఆర్‌కు ప్రత్యామ్నాయం చూపలేదని మండిపడ్డారు. కరోనా, నోట్ల రద్దు వంటి ప్రధాని మోదీ అనాలోచిత, అసంబద్ధ నిర్ణయాలతో దేశంలో ఆర్థిక, సామాజిక సంక్షోభం ఏర్పడినా.. తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించిందని గుర్తుచేశారు.
హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టుకు చేస్తున్న మోసాలను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ గల్లీ లీడర్లు పూటకో మాట మాట్లాడి రాజకీయ పబ్బం గడుపుకున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టు రద్దుపై తెలంగాణ బీజేపీ నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్, ఉత్తరప్రదేశ్, లకు లెక్కలేనన్నీ కేంద్ర పథకాలను మంజూరు చేసుకుంటూ.. తెలంగాణకు మాత్రం అన్యాయం చేసిందన్నారు. ఐటీఐఆర్‌కు ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ ఐటీ పరిశ్రమకు మోడీ ప్రభుత్వం ఇచ్చిందేంటో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా 22 సాఫ్ట్‌వేర్ పార్కులను ప్రకటించి తెలంగాణకు మెండిచేయి చూపడం బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ పట్ల ఉన్న చిన్నచూపుకు నిదర్శనమన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యూబేటర్ టీహాబ్ -2 నిర్మాణాన్ని 450 కోట్లతో పూర్తి చేసినా కేంద్రం నుంచి ఒక్క పైసా నిధులు ఇవ్వలేదని ఆరోపించారు.
ఐటీఐఆర్ ప్రాజెక్టు రద్దుపై మోదీ ప్రభుత్వం వివరణ ఇవ్వడంతో పాటు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఐటీ రంగంతో పాటు అన్ని అంశాల్లో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్ర విధానాలను తెలంగాణ యువత గమనించాలని కేటీఆర్ కోరారు. ఇప్పటికైనా దేశ ఐటీ రంగానికి దిక్సూచిగా ఎదుగుతున్న తెలంగాణ ఐటీ రంగానికి కేంద్రం.. ఐటీఐఅర్‌కు సమానంగా ఒక పథకాన్ని లేదా ప్యాకేజీని ప్రకటించి తెలంగాణ పట్ల తమ నిబద్దత చాటుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com