KTR: దేశంలో ఇప్పుడున్న ప్రధాన సమస్య ఇదే: కేటీఆర్

KTR: తెలంగాణ ఐటీ, పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ ఎన్‌హెచ్ఆర్డీ ఆధ్వర్యంలో నిర్వహించిన డీకోడ్ ది ఫ్యూచర్ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో మాట్లాడారు.. భారత్‌లో ఆర్థిక అభివృద్ధి కన్నా రాజకీయాలపై దృష్టి ఎక్కువ పెడుతున్నారని ఈ ధోరణి మారాలని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఏడాది పొడవునా ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. దీంతో వారి ఫోకస్ అంతా ఎలక్షన్స్‌పైనే ఉంటుంది. దేశంలో ఇప్పుడున్న ప్రధాన సమస్య ఇదే అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
తాజాగా కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో దేశ అభివృద్ధి కోసం ఎక్కడా కేటాయింపులు జరిగినట్లు కనిపించలేదు. చైనా, జపాన్ దేశాలు అభివృద్ధి పధంలో పయనిస్తున్నాయి. కానీ మనదేశంలో యువత 60 శాతం ఉన్నా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుందే తప్ప ఉద్యోగాలు సృష్టించే యోచన చేయడం లేదు. చిన్న చిన్న దేశాలు కూడా కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ ముందుకు వెళుతున్నాయి. మనం మాత్రం వెనుకబడే ఉన్నాం. ఈ పరిస్థితిలో మార్పు రావాలి అని అన్నారు. సింగపూర్ మన హైదరాబాద్ కంటే చిన్నది.. కానీ ఈ రోజు ఆర్థిక వ్యవస్థ విషయంలో ఎంతో ముందుంది.
దేశ అభివృద్ధిలో తెలంగాణ పాత్ర గణనీయమైనది. అమెజాన్‌కు చెందిన క్యాంపస్ ప్రపంచంలోనే పెద్దది మన హైదరాబాద్‌లోనే ఉంది. గూగుల్, ఉబర్ కంపెనీలు కూడా వాటి సెకండ్ క్యాంపస్‌లను అమెరికా తర్వాత భాగ్యనగరంలో ఏర్పాటు చేసుకున్నాయి. ఇతర దేశాల మాదిరిగా భారత్‌లోనూ ఆర్థిక అభివృద్ధిపై దృష్టి పెడితే భారత్ నంబర్ వన్ దేశంగా ఎదుగుతుంది అని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com