అమ్మానాన్నలేని బాలికకు అండగా నిలిచిన కేటీఆర్..

అమ్మానాన్నలేని ఆ చిన్నారిని అన్నగా నిలబడి అక్కున చేర్చుకున్నారు. విద్యే నీకు నలుగురిలో గుర్తింపు తీసుకువస్తుందని ఉన్నత విద్యకు సాయపడ్డారు.. ఇప్పుడు ఆ చిన్నారి పెరిగి పెద్దదై ఉద్యోగం చేస్తూ తన కాళ్ల మీద తాను నిలబడుతోంది. అన్నగా నిలబడిన కేటీఆర్ కు ఉద్యోగం చేస్తూ సంపాదించిన దాంట్లో కొంత మిగిల్చి లక్షరూపాయలు పోగు చేసి సీఎం సహాయనిధికి అందజేసింది.
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తండ్రియాల్ గ్రామానికి చెందిన రుద్ర రచన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ రచనకు అన్నీ తానై అండగా నిలబడ్డారు. రచన ఆయన నమ్మకాన్ని వమ్ము చేయలేదు. హాప్టల్ లో ఉంటూ బీటెక్ పూర్తి చేసింది. ఇటీవలే ఉద్యోగాన్ని సంపాదించింది. తనలాంటి అనాధలను ఆదుకోవాలని సీఎం సహాయనిధికి లక్షరూపాయల విరాళాన్ని అందించింది. మంత్రి కేటీఆర్ చేసిన సాయం మరువలేనంటూ ట్వీట్ చేసింది.
రచన ఆలోచన ఎందరికో స్ఫూర్తి దాయకం అంటూ కేటీఆర్ రీ ట్వీట్ చేశారు. నీ ట్వీట్ చూసి నా మనసు ఆనందంతో నిండిపోయింది. ఎంత మంచి ఆలోచన చేశావు తల్లీ అని భావోద్వేగం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చదువు కోసం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆర్ధిక సాయాన్ని అందుకుంటున్న రచన ఫోటోను, బీటెక్ పూర్తయిన అనంతరం ఆమె తనకు రాఖీ కడుతున్న చిత్రాన్ని, ముఖ్యమంత్రి సహాయ నిధికి రచన అందజేసిన నగదు అధికారిక ధ్రువపత్రాన్నికేటీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com