KTR: 4 ప్రశ్నలే 40 సార్లు అడిగారు: కేటీఆర్
ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది. ‘నాకు తెలిసిన సమాచారమంతా ఏసీబీ అధికారులకు చెప్పా. సీఎం రేవంత్ రెడ్డి రాసిచ్చిన ప్రశ్నలే అధికారులు తిప్పి, తిప్పి అడిగినట్లుంది. నాలుగు ప్రశ్నలనే 40 సార్లు అడిగారు. కొత్తగా వాళ్లు అడిగింది ఏమి లేదు. ఈ వ్యవహారంలో ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తానని ఏసీబీకి చెప్పా’ అని కేటీఆర్ పేర్కొన్నారు. తనను జైల్లో పెట్టించాలని సీఎం రేవంత్ చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ.. ఏసీబీ అధికారులు 82 ప్రశ్నలు అడిగారు. అడిగిన ప్రశ్నలే తిప్పి తిప్పి అడిగారు. అవినీతి చేస్తే సీఎం రేవంత్ చేస్తారు. మేం అలాంటివి చేయమని కుండబద్దలు కొట్టి చెప్పా. ఇలాంటి కేసులు వంద పెట్టినా ఎదుర్కొంటా. ఎన్ని కేసులు పెట్టినా కేసీఆర్ సైనికులుగా ప్రజాసమస్యలపై మాట్లాడుతూనే ఉంటాం’ అని అన్నారు.
రేవంత్ ప్రశ్నలు పంపితే మళ్లీ వెళ్తా
ఇక్కడి నుంచి పోయిన కాసులు ఫార్ములా ఈ సంస్థ వద్ద ఉన్నాయని చెప్పానని కేటీఆర్ వెల్లడించారు. మరి అలాంటప్పుడు కేసు ఎక్కడ ఉందని ప్రశ్నించినట్టు తెలిపారు. విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వెళతానన్నారు. రేవంత్ రెడ్డి చెప్పిన ప్రశ్నలు పట్టుకొని మళ్లీ పిలిస్తే మళ్లీ వెళ్తాను అని స్పష్టం చేశారు. అవినీతి లేని కేసులో అవినీతి గురించి అడిగే ప్రశ్న ఎక్కడిదని కేటీఆర్ ప్రశ్నించారు. "ఆ ఫైల్ ఎక్కడ పోయింది... ఈ ఫైల్ ఎక్కడ పోయింది అని అడిగారు. నేను మంత్రిగా నిర్ణయం తీసుకున్నా అని స్పష్టం చేశాను. న్యాయస్థానాలు, కోర్టులపైన నమ్మకం ఉంది... తప్పకుండా సహకరిస్తాం. ఇది ముమ్మాటికి లొట్ట పీసు కేసునే ఆయన లొట్ట పీసు ముఖ్యమంత్రినే." అని కేటీఆర్ అన్నారు.
నా అరెస్ట్ ఎప్పుడు.. ఏసీబీకి కేటీఆర్ ప్రశ్న
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరవ్వగా... ఏడు గంటల పాటు విచారణ సాగింది. కేసు సంబంధిత ప్రధాన విషయాలపై కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నించింది. అయితే విచారణ సమయంలో కేటీఆర్ ఏసీబీ అధికారులను తనను ఎప్పుడు అరెస్ట్ చేస్తారని పదేపదే ప్రశ్నించారు. ఇప్పుడు చేస్తున్న విచారణ అంతా ఫార్మాలిటీనే కదా.. ? అరెస్ట్ చేయడం ఖాయమే కదా? అని అధికారులను అడిగారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com