SIT: నేడు సిట్ విచారణకు కేటీఆర్

తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు పిలిచింది. గురువారం 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసిన సిట్, ఇవాళ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌లోని తమ కార్యాలయానికి హాజరుకావాలని సూచించింది. ఈ మేరకు ఏసీపీ పి. వెంకటగిరి నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే పలువురు కీలక వ్యక్తులను విచారించిన సిట్, తాజాగా కేటీఆర్‌ను పిలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసు దర్యాప్తునకు ఉపకరించే అంశాలపై ఆయన నుంచి వివరాలు సేకరించాల్సి ఉందని నోటీసుల్లో పేర్కొంది.
ఇప్పటికే హరీశ్‌రావుపై విచారణ
ఇదే కేసులో ఈ నెల 20న మాజీ మంత్రి హరీశ్‌రావును సిట్ అధికారులు విచారించారు. ఆ విచారణ తర్వాత కొద్ది రోజుల వ్యవధిలోనే కేటీఆర్‌కు నోటీసులు జారీ కావడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ అగ్రనాయకత్వానికి చెందిన ఇద్దరు కీలక నేతలు వరుసగా సిట్ విచారణకు హాజరవడం, కేసు దర్యాప్తు మరింత లోతుగా సాగుతున్నట్లు సంకేతాలు ఇస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) కేంద్రంగా ఫోన్ అక్రమ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలతో 2024 మార్చిలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, ఇతర ప్రముఖుల ఫోన్లను అనధికారికంగా నిఘా పెట్టారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తును హైదరాబాద్ పోలీస్ కమిషనర్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించారు. అప్పటి నుంచి సిట్ వివిధ దశల్లో సాక్ష్యాలు సేకరిస్తూ, పలు కీలక వ్యక్తులను విచారిస్తూ ముందుకు సాగుతోంది.
కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ జారీ చేసిన నోటీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు సిరిసిల్లలో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ ప్రజల దృష్టిని మళ్లించేందుకే అని విమర్శించారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరుసగా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. సిట్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, “ఇది అసలు స్వతంత్ర దర్యాప్తు కాదు. ఇది రేవంత్‌రెడ్డి సిట్. ఆయన కూర్చోమంటే కూర్చుంటుంది, నిలబడమంటే నిలబడుతుంది” అంటూ ఎద్దేవా చేశారు. గత కొంతకాలంగా ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి కొన్ని రోజులు హడావుడి చేసి తర్వాత వదిలేయడం ప్రభుత్వానికి అలవాటైందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కొన్ని రోజులు డ్రామా జరిగిందని, ఆ తర్వాత కార్ రేసు అంశం, గొర్రెల స్కామ్, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటూ వరుసగా కథనాలు మారుతున్నాయని అన్నారు. వీటన్నింటిలోనూ అసలు విషయమే లేదని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. సింగరేణి కుంభకోణాన్ని బయటపెట్టిన కారణంగానే తనకు, హరీశ్‌రావుకు నోటీసులు వచ్చాయని కేటీఆర్ ఆరోపించారు. ఉదయం ఒక స్కామ్ బయటపెడితే, సాయంత్రానికి సిట్ నోటీసులు అందుతున్నాయంటే అది స్పష్టమైన రాజకీయ ప్రతీకారమేనని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
