KTR: తెలంగాణ టెక్స్‌టైల్‌ రంగానికి కేంద్రం చేసిందేమీ లేదు: కేటీఆర్‌

KTR: తెలంగాణ టెక్స్‌టైల్‌ రంగానికి కేంద్రం చేసిందేమీ లేదు: కేటీఆర్‌
X
KTR: తెలంగాణ టెక్స్‌టైల్‌ రంగానికి కేంద్రం చేసిందేమీ లేదని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు.

KTR: తెలంగాణ టెక్స్‌టైల్‌ రంగానికి కేంద్రం చేసిందేమీ లేదని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. టెక్స్‌టైల్ రంగానికి కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన సహాయం, చేపట్టాల్సిన చర్యలపై ఆయన కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌కు లేఖ రాశారు. వ్యవసాయం తర్వాత అత్యధిక మంది దేశ ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న టెక్స్‌టైల్‌ రంగంపై మోదీ ప్రభుత్వానికి చిన్నచూపు, నిరాసక్తత ఉందని లేఖలో విమర్శించారు. శుష్క వాగ్ధానాలు – రిక్త హస్తాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్న మోదీ సర్కారు తెలంగాణ నేతలన్న కడుపు కొడుతోందని కేటీఆర్‌ మండిపడ్డారు.

తెలంగాణ టెక్స్‌టైల్‌ రంగానికి సాయం చేశామంటూ ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులు అసత్యాలు వల్లె వేస్తున్నారని.. నేతన్నలకు సహాయం చేస్తే మంచిదని హితవు పలికారు. టెక్స్ టైల్ రంగానికి, చేనేత కార్మికులకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం నయా పైసా అదనపు సాయం చేయలేదని లేఖలో ఆరోపించారు. వ్యవసాయం తర్వాత దేశంలో అత్యధిక ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న టెక్స్‌టైల్‌ రంగ ప్రస్తుత దుస్థితికి కేంద్ర ప్రభుత్వ మతిలేని విధానాలే కారణమన్నారు.

నిధులు, నియామకాలు, నీళ్లతో పాటు నేతన్నల బాగు కోసం ఉద్యమించిన తాము, అధికారంలోకి వచ్చిన ఎనిమిదేళ్ల నుంచి టెక్స్‌టైల్ రంగాన్ని ఆదుకోవాలని వివిధ రూపాల్లో కేంద్రాన్ని కోరామని కేటీఆర్‌ గుర్తు చేశారు. ఎన్నో రంగాలను నిర్వీర్యం చేసినట్టుగానే మోదీ ప్రభుత్వం టెక్స్‌టైల్ – చేనేత రంగంపై కూడా కక్ష కట్టిందని ఆరోపించారు. చేనేతపై జీఎస్టీ వంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ నేతన్నల పొట్టగొడుతోందని కేటీఆర్‌ విమర్శించారు.

దేశంలోనే అతిపెద్ద కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌కు కేంద్రం సహాయం ఎక్కడని ప్రశ్నించారు కేటీఆర్‌. ఇటీవల తెలంగాణకు వచ్చిన ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్న మెగా టెక్స్‌టైల్‌ పార్క్ ఎక్కడ ఉందో.. తెలంగాణ ప్రజలకు చెప్పాలని లేఖలో డిమాండ్ చేశారు. 1,500కోట్లకుపైగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మొదలుపెట్టిన కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో కేంద్రం తరఫున కనీసం మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరితే, ఇప్పటివరకు స్పందించని బీజేపీ ప్రభుత్వం మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.

రాష్ట్రంలోనే అత్యధిక పవర్ లూమ్ మగ్గాలు ఉన్న సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరితే.. ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని కేటీఆర్ ఆరోపించారు. 26 వేల మంది పవర్ లూం కార్మికుల ఆర్థిక భవిష్యత్‌ కోసం మోదీ సర్కార్ చేసింది ఏం లేదన్నారు. దేశంలో చేనేత కార్మికులపై కేంద్రానికి ప్రేమ ఉంటే ఈనెల 7న జరిగే జాతీయ చేనేత దినోత్సవం నాటికి జీఎస్టీ పన్ను రద్దు చేయాలని కేటీఆర్‌ కోరారు.

Tags

Next Story