Kumaraswamy : కేసీఆర్ అపార అనుభవం.. దేశానికి ఎంతో అవసరం : కుమారస్వామి

Kumaraswamy : కేసీఆర్ అపార అనుభవం.. దేశానికి ఎంతో అవసరం : కుమారస్వామి
X
Kumaraswamy : ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలోనే జాతీయ పార్టీని ప్రకటించి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నారనే వార్తలను కుమారస్వామి స్వాగతించారు

Kumaraswamy : ముఖ్యమంత్రి కేసీఆర్‌ అపార అనుభవం ప్రస్తుత పరిస్థితుల్లో భారత దేశానికి ఎంతో అవసరం ఉందని కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి స్పష్టం చేశారు.. దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటుకు ముందుకు నడుస్తూ, క్రియాశీలక పాత్ర పోషించాలని, అందుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలోనే జాతీయ పార్టీని ప్రకటించి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నారనే వార్తలను కుమారస్వామి స్వాగతించారు.

వర్తమాన జాతీయ రాజకీయాల్లో, దేశ పాలనలో ప్రత్యామ్నాయ శూన్యత నెలకొన్న నేపథ్యంలో కేసీఆర్‌ వంటి సీనియర్‌ లీడర్‌ ఆవశ్యకత దేశానికి అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కుమారస్వామి కలిశారు.. జాతీయ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్‌ అలుపెరుగకుండా సాగించిన ఉద్యమం, శాంతియుత పంథాలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, అదే పద్ధతిలో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న తీరుపై ఇద్దరి మధ్యా చర్చ జరిగింది.

ఎనిమిదేళ్ల కాలంలోనే తెలంగాణ సాధించిన అభివృద్ధిని చూసి దేశమంతా చర్చిస్తోందన్నారు కుమారస్వామి.. తమకూ ఈ అభివృద్ధి కావాలని దేశ ప్రజలు కోరుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా కుమారస్వామి సీఎం కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా పోల్చి చూస్తే తెలంగాణలో మాత్రమే అమలవుతున్న 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌, తాగు, సాగు నీరు, వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చను కేసీఆర్‌తో పంచుకున్నారు.

దేశంలో విచ్ఛిన్నకర పాలన ధోరణలు రోజురోజుకూ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజల మధ్య విభజన సృష్టించే కుట్రలను సమష్టిగా తిప్పికొట్టాలని అవసరాన్ని సీఎం కేసీఆర్‌ ఆయనకు వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రమాదకర స్వార్థ రాజకీయ పంథాను, దాని పర్యవసానాలను చర్చించిన ఇరువురు నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.. ఎట్టి పరిస్థితుల్లో దేశాన్ని మత విద్వేషపు ప్రమాదకర అంచుల్లోకి నెట్టకుండా కాపాడుకుంటామని ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే అనే అభిప్రాయం దేశ ప్రజల్లో సన్నగిల్లిందని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజాస్వామిక సమాఖ్య స్ఫూర్తి పరిఢవిల్లేలా ప్రాంతీయ పార్టీల ఐక్యత నేటి దేశ రాజకీయాలకు తక్షణ అవసరమని ఇద్దరు నేతలూ అభిప్రాయానికి వచ్చారు.

Tags

Next Story