LABOUR LAWS: కార్మికులకు గుడ్ న్యూస్

కేంద్ర ప్రభుత్వం దేశంలో కార్మిక సంస్కరణల్లో భాగంగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 29 పాత కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా రూపొందించిన నాలుగు కార్మిక స్మృతులను తక్షణమే అమల్లోకి తెస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ నాలుగు కోడ్లను నోటిఫై చేసినట్లు వెల్లడించారు.
అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలు:
* వేతనాల కోడ్, 2019
* పారిశ్రామిక సంబంధాల కోడ్, 2020
* సామాజిక భద్రత కోడ్, 2020
* వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని ప్రదేశంలో పరిస్థితుల కోడ్, 2020
ఈ కీలక చర్యతో కార్మిక నిబంధనలు, కార్మికుల సంక్షేమం మెరుగుపడతాయని, దేశీయ పరిశ్రమలు బలోపేతం అవుతాయని కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొంది. 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్య సాధనలో భాగంగా, మారుతున్న పనితీరుకు అనుగుణంగా శ్రామిక వ్యవస్థను సంసిద్ధం చేయడమే ఈ సంస్కరణల లక్ష్యమని వివరించింది. మన దేశంలో చాలా కార్మిక చట్టాలను 1930ల నుంచి 1950ల మధ్య కాలంలో రూపొందించారు. ఆ నాటి ఆర్థిక వ్యవస్థ, పని విధానం ఇప్పుడున్న దాని కంటే భిన్నంగా ఉండేవి. ఇతర దేశాలు తమ చట్టాలను సరళతరం చేసుకుని ఏకీకృతం చేసినప్పటికీ, భారత్ మాత్రం 29 పాత చట్టాల్లో ఉన్న సంక్లిష్టమైన, కాలం చెల్లిన నిబంధనలతో కొనసాగుతూ వచ్చింది. ఈ సంస్కరణలతో ఆ సమస్య తొలగిపోతుందని కేంద్రం ధీమా వ్యక్తం చేసింది. కొత్త లేబర్ కోడ్‌లకు 2020లోనే చట్టరూపం లభించినప్పటికీ, వివిధ రాష్ట్రాలు నిబంధనలను నోటిఫై చేయడంలో ఆలస్యం చేయడంతో అమలు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా కేంద్రం చేసిన ప్రకటనతో ఈ సుదీర్ఘ సంస్కరణ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. ఈ కొత్త వ్యవస్థ కార్మికులకు కనీస వేతనం, సామాజిక భద్రత వంటి హక్కులను విశ్వవ్యాప్తం చేయడమే కాకుండా, పారిశ్రామిక సామరస్యాన్ని పెంచి, సులభతర వాణిజ్యానికి మార్గం సుగమం చేస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

