TG: జైలు నుంచి లగచర్ల రైతులు విడుదల

లగచర్లలో అధికారులపై దాడి కేసులో అరెస్ట్ అయిన రైతులు జైలు నుంచి విడుదలయ్యారు. 39 రోజుల తర్వాత 17 మంది రైతులు జైలు నుంచి విడుదలయ్యారు. గురువారం బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి జైలు నుంచి విడుదలవ్వగా.. ఇవాళ రైతులు విడుదలయ్యారు. ఈ కేసులో ఏ2 సురేష్ మాత్రం ఇంకా జైలు నుంచి విడుదల కాలేదు. విడుదల అనంతరం రైతులు భావోద్వేగానికి గురయ్యారు. రైతుల విడుదలను ప్రతిపక్ష పార్టీలు స్వాగతించాయి. నవంబర్ 11న ఫార్మా విలేజ్ పేరుతో జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు భూసేకరణలో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణ కోసం లగచర్ల వెళ్లారు. కార్యక్రమాన్ని రైతులు అడ్డుకున్నారు. రైతులు తమపై దాడి చేశారంటూ కొందరు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదేరోజు అర్ధరాత్రి పోలీసులు ఐదు గ్రామాల్లో దొరికిన వారిని దొరికినట్టుగా అరెస్టు చేశారు.
పట్నం విడుదల
అయితే ఇదే కేసులో అరెస్టయిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితోపాటు 24 మంది రైతులకు నాంపల్లి స్పెషల్ కోర్టు ఈ నెల 18న బెయిల్ మంజూరు చేసింది. గురువారం జైలు అధికారులకు ఆలస్యంగా బెయిలు పత్రాలు అందాయి. దీంతో రైతులు విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం జైలు నుంచి బయటకు వచ్చారు. జైలు బయట రైతులకు బీఆర్‌ఎస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అయితే కేసులో ప్రధాన నిందితుడు సురేశ్ సహా మరో ఏడుగురికి బెయిల్ లభించలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com