Shamshabad Airport: ఎట్టకేలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చిక్కిన చిరుత

Shamshabad Airport: ఎట్టకేలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చిక్కిన చిరుత
నెహ్రూ జూ పార్క్‌కు చిరుత తరలింపు

ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. ఐదు రోజులుగా అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. పట్టుకోవడానికి ఐదు బోన్లు, 25 కెమెరాలు ఏర్పాటు చేశారు. చిరుత బోనులో చిక్కింది. ప్రాథమిక వైద్య పరీక్షల కోసం దాన్ని నెహ్రూ జూ పార్కుకు తరలించారు. జూలో ఆరోగ్య పరిస్థితి పరిశీలించి అమ్రాబాద్ పులుల అభయారణ్యానికి తరలిస్తారు. చిరుతపులి చిక్కడంతో పరిసర గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

ఐదు రోజులు అటవీ శాఖ అధికారులు, శంషాబాద్‌ విమానాశ్రయ సిబ్బందికి చుక్కలు చూపించిన చిరుతపులి.. ఎట్టకేలకు దొరికింది. ఆదివారం రాత్రి శంషాబాద్‌ విమానాశ్రయ ప్రహరీ గోడ దూకిన చిరుత.. అప్పటి నుంచి బయటకు వెళ్లలేక అక్కడే తచ్చాడింది. దట్టంగా పెరిగిన చెట్లు, గడ్డి... నీరు, ఆహారం ఉండటంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా విమానాశ్రయ పరిసరాల్లో ఐదురోజులు తిరిగింది. చిరుత సంచారాన్ని గమనించిన విమానాశ్రయ సిబ్బంది.. అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. ఆ ప్రాంతంలో ఐదు బోన్లు సహా 25 ట్రాప్‌ కెమేరాలను అమర్చి చిరుత సంచారాన్ని గమనించారు. బోనులో మేకను ఎరగా ఉంచారు. బోన్లవైపు రెండు మూడుసార్లు చిరత వచ్చినా.. అందులోకి వెళ్లలేదు. గురువారం రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో బోనులో చిక్కింది.

ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు... చిరుతను ప్రత్యేక వాహనంలో నెహ్రూ జూ పార్కుకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించి ఒక రోజు పర్యవేక్షణ అనంతరం అమ్రాబాద్‌ పులుల అభయారణ్యానికి తరలిస్తారు. చిరుతపులి చిక్కడంతో విమానాశ్రయ పరిసరాల గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. చిరుత సంచారంతో స్థానికులు ఐదు రోజులుగా భయం భయంగా గడిపారు.

Tags

Read MoreRead Less
Next Story