liquor Scam: సీబీఐ కస్టడీలో ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ దూకుడు పెంచింది. దీనిలో భాగంగా ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును రౌస్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సీబీఐ కస్టడీకి అప్పగించింది. హైదరాబాద్‌లో బుచ్చిబాబును మంగళవారం అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు సీబీఐ ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్ ఎదుట నిన్న హాజరు పర్చింది. మద్యం కేసులో మరింత సమాచారం రాబట్టేందుకు ఆయనను అయిదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ తరఫు న్యాయవాదులు ప్రత్యేక జడ్జికి విజ్ఞప్తి చేశారు. అందుకు బుచ్చిబాబు తరఫున న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే అభ్యంతరం వ్యక్తం చేశారు. బుచ్చిబాబును సీబీఐ అక్రమంగా అరెస్టు చేసిందని, మద్యం విధానంపై ప్రశ్నించేందుకు ఇప్పటికే సుమారు 40 సార్లు సీబీఐ అధికారులు ఆయనను పిలిచారని తెలిపారు. ఛార్టెడ్ అకౌంటెంట్‌గా ఉన్న బుచ్చిబాబు వృత్తిపరమైన సేవలు అందించారని, కేసు దర్యాప్తునకు సహకరిస్తున్నారని తెలిపారు. నగదు లావాదేవీల్లో ఆయన పాల్గొనలేదని, ఏ రకంగానూ లబ్ధిపొందలేదని వివరించారు. బుచ్చిబాబును సీబీఐ కస్టడీకి ఇవ్వవద్దని కోరారు.
విచారణకు సహకరించనందునే కస్టడీకి కోరుతున్నామని సీబీఐ న్యాయవాదులు తెలిపారు. ఇరుపక్షాల వాదనల అనంతరం ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్ బుచ్చిబాబును సీబీఐ కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే కేసులో మరోవైపు పంజాబ్‌కు చెందిన మద్యం వ్యాపారి, ఒయాసిస్ గ్రూప్ ప్రమోటర్ గౌతమ్ మల్హోత్రాను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఏడు రోజుల ఈడీ కస్టడీకి ఇచ్చింది. శిరోమణి అకాలీదళ్ మాజీ ఎమ్మెల్యే, మద్యం వ్యాపారి దీప్ మల్హోత్రా కుమారుడైన గౌతమ్ మల్హోత్రాను దిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో అక్రమ నగదు చలామణీ నిరోధక చట్టం కింద ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆయనను సీబీఐ ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్ ఎదుట ఈడీ అధికారులు హాజరుపర్చగా ఏడురోజుల కస్టడీ విదించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com