LOCAL BODY: రసవత్తరంగా "స్థానిక" రాజకీయం

తెలంగాణలో మరో వారం రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అస్త్ర శస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటి క్షేత్రస్థాయిలో బలోపేతం కావాలని చూస్తున్నాయి. సంక్షేమ పథకాల అమలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి సిద్ధమవుతుండగా.. రైతు భరోసా సహా కీలక హామీలు అమలులో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మిగిలిన పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి.
వ్యూహాత్మకంగా కాంగ్రెస్
ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ముందుకు పార్టీ గుర్తుపై జరిపే ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ముందుగా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ లను దెబ్బకొట్టేందుకు ఇదే సరైన వ్యూహంగా భావిస్తోంది. మహాలక్ష్మి పథకం తమకు ఓట్లు కురిపిస్తోందని గట్టిగా నమ్ముతోంది. పదేళ్ల తర్వాత ఇప్పటికే రేషన్ కార్డులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వానికి స్థానిక ఎన్నికల్లో కాస్త లబ్ధి చేకూరే అవకాశం ఉంది. అయితే పార్టీలో కుమ్ములాటలు ఆపార్టీకి శరాఘాతంగా మారుతున్నాయి. సంక్షేమ పథకాల అమలుతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే సంక్షేమ పథకాల అమలులో అలసత్వం కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకతను పెంచుతోంది. మరోవైపు హస్తం పార్టీ అగ్రనేతలు అందరూ సంస్థాగత ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.
బీఆర్ఎస్ వ్యూహాత్మక మౌనం
ఇప్పటికే శాసనసభ ఎన్నికల ఓటమితో డీలాపడ్డ గులాబీ పార్టీని ఎంపీ ఎన్నికలు మరింత కుంగదీశాయి. ఇప్పుడు రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు గులాబీ పార్టీ దూరంగా ఉంది. దీంతో బీఆర్ఎస్ పార్టీలో నిస్తేజం ఆవహించింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీగా స్థానాలు కైవసం చేసుకోవాలని గులాబీ పార్టీ వ్యూహరచన చేస్తోంది. అధినేత కేసీఆర్ క్షేత్రస్థాయిలోకి దిగి మళ్లీ ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం ఆ పార్టీకి కొత్త ఊపిరినిస్తోంది. మరోవైపు కేటీఆర్ ఇప్పటికే సీఎం సొంత నియోజకవర్గంలో నిర్వహించిన సభకు భారీ స్పందన రావడం ఆ పార్టీకి జోష్ ను తెచ్చింది. ఇదే జోష్ తో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ భావిస్తోంది.
ఢిల్లీ ఊపులో బీజేపీ
ఢిల్లీ ఎన్నికల్లో 27 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పుడు అదే ఊపులో ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. ఢిల్లీ ఎన్నికల్లో వచ్చిన జోష్ తో క్షేత్రస్థాయిలో మరింత ఉత్సాహంతోపని చేయాలని చూస్తోంది. ఇప్పటికే బీజేపీ సంస్థాగతంగా పార్టీని సిద్ధం చేసింది. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కొత్త అధ్యక్షులను నియమించే ప్రక్రియ పూర్తి చేసింది. కొత్త అధ్యక్షుల సారథ్యంలో స్థానిక సంస్థల్లో ఎక్కువ స్థానాల్లో గెలిచి... 2029 ఎన్నికల్లో అధికారానికి చేరువ కావాలని బీజేపీ చూస్తోంది..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com