LOCALBODY ELECTIONS: స్థానిక సంస్థల ఎన్నికలు..మూడు మార్గాలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ సర్కార్ జారీ చేసిన జీవో నెంబర్ 9 అమలుపై హైకోర్టు మధ్యంతర స్టే విధించడం సరికొత్త చర్చకు దారి తీశాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ.. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై రెండు రోజుల పాటు వాదనలు విన్న హైకోర్టు తుది నిర్ణయం వెల్లడించింది. దీని ప్రకారం జీవో 9 పై స్టే విధించింది. దీంతో, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది. జీవో నెంబర్ 9పై హైకోర్టు మధ్యంతర స్టే విధించడంతో, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముందు మూడు ప్రధాన ఆప్షన్స్ ఉన్నాయి. హైకోర్టు జీవో నెంబర్ 9పై విధించిన స్టేను సుప్రీంకోర్టులో సవాల్ చేయడం ప్రభుత్వానికి ఉన్న తొలి ఆప్షన్. దీనిపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసి, విచారణకు వచ్చేలా చూడటం. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ట్రిపుల్ టెస్ట్ ప్రక్రియను రిజర్వేషన్లు పెంపు సందర్భంగా పాటించినట్లు చట్టపరంగా నిరూపించాల్సి ఉంటుంది.
హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు త్వరగా నిర్వహించాలనుకుంటే, పాత రిజర్వేషన్లనే అమలు చేస్తూ ఎన్నికల ప్రక్రియలో ముందుకు సాగడం రెండో ఆప్షన్. లేదా ప్రభుత్వం దీనిపై సుప్రీంలో పిటిషన్ వేయకపోయినా, ఒకవేళ పిటిషన్ వేసినప్పటికీ జీవో నెంబర్ 9పై స్టే ఎత్తివేయకపోతే ఉన్న మరో ఆప్షన్... 42 శాతం రిజర్వేషన్లు బదులు, పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించడం.
గవర్నర్ ఆమోదం లేకుండానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు జీవో నెంబర్ 9ను జారీ చేయడంపై హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఈ జీవోకు చట్టబద్ధ సవరణ చేయడం మరో ఆప్షన్ గా చెప్పవచ్చు. బీసీ బిల్లును గవర్నర్ ద్వారా ఆమోదింపజేయడం, హైకోర్టు లేవనెత్తిన సాంకేతిక అంశాల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం ఈ ఆప్షన్లో భాగంగా చెప్పవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com