MLC: కాంగ్రెస్ పార్టీకి షాక్
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల MLC ఉపఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయకేతనం ఎగరేసింది. బీఆర్‌ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్ రెడ్డి.. సమీప ప్రత్యర్థి మన్నె జీవన్‌రెడ్డిపై 109 ఓట్లతో విజయం సాధించారు. ఆవిర్భావ వేడుకల సందర్భంగా సాధించిన ఈ విజయాన్ని అమరవీరులకు అంకితమిస్తున్నట్లు నవీన్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసిన నైతిక విజయం కాంగ్రెస్‌దేనంటూ మంత్రి జూపల్లి వ్యాఖ్యానించారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థానికసంస్థల MLC కసిరెడ్డి నారాయణరెడ్డి శాససభ్యుడిగా ఎన్నిక కాగా... ఆయన రాజీనామాతో ఈ స్థానానికి ఉపఎన్నిక జరిగింది. మార్చి 28న పోలింగ్ జరగ్గా.. వేయి 439 మంది ఓటర్లకు.. ఇద్దరు మినహా అందరూ తమ హక్కు వినియోగించుకున్నారు. ఈ ఓట్లను మహబూబ్‌నగర్ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో లెక్కించారు. పోలైన ఓట్లను సరిచూసుకుని.. అందులో 21 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. చెల్లుబాటైన వేయి 416 ఓట్ల ఆధారంగా 709 ఓట్లను కోటాగా గుర్తించారు. అనంతరం మొదటి ప్రాధాన్య ఓట్లు లెక్కించారు. ఇందులో బీఆర్‌ఎస్ అభ్యర్ధి నవీన్‌కుమార్ రెడ్డి 709 కంటే అధికంగా 762 ఓట్లు సాధించి విజయాన్ని కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి మన్నెజీవన్ రెడ్డికి 653 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్ధికి ఒకటే మొదటి ప్రాధాన్య ఓటు దక్కింది. కోటా కంటే అధికంగా ఓట్లు రావడంతో నవీన్‌కుమార్‌రెడ్డిని విజేతగా ప్రకటించారు.
MLC ఉపఎన్నికల ఫలితాన్ని అమరులకు అంకితమిస్తున్నట్లు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, విజేత నవీన్ కుమార్ రెడ్డి వెల్లడించారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారాసకు స్పష్టమైన అధిక్యం ఉండటంతో కాంగ్రెస్ పోటీ చేయలేదని.. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆధిక్యం లేకపోయినా.. అభ్యర్ధిని బరిలో దింపారని విమర్శించారు. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతిక విజయం కాంగ్రెస్ పార్టీదేనని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. భారాస అభ్యర్థి నవీన్ కుమార్ గెలుపు సాంకేతికం మాత్రమేనని.. వ్యాఖ్యానించారు.. MLCగా గెలిచిన నవీన్‌కుమార్ రెడ్డి.. బంజారాహిల్స్ నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి.. ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా అధినేత నవీన్‌కుమార్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com