Mahabubnagar: కనీస ధర కోసం వేరుశనగ రైతుల ఆందోళన

Mahabubnagar: కనీస ధర కోసం వేరుశనగ రైతుల ఆందోళన
మార్కెట్ కమిటీ ఆఫీసులో ఫర్నీచర్ ధ్వంసం

ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వేరుశనగ రైతులు రోడ్డెక్కుతూనే ఉన్నారు. ఒకట్రెండు రోజుల కింద అచ్చంపేట, కల్వకుర్తి మార్కెట్ల వద్ద పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించగా.. మంగళవారం మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ వ్యవసాయ మార్కెట్లలో రైతులు నిరసనకు దిగారు. మహబూబ్‌నగర్‌ వ్యవసాయ మార్కెట్‌కు 679 మంది రైతులు 27 వేల బస్తాల వేరుశనగ తీసుకొచ్చారు. అందులో 26 మందికి 5 వేల లోపు, 126 మందికి 6 వేల లోపు, 288 మందికి MSP కన్నా అధికంగా ధరలు పలికాయి. కనిష్ఠ ధర 4 వేలు పలకడాన్ని చూసిన రైతులు... ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. నెల క్రితం 8 వేలకు పైగా పలికిన ధరలు.. ఇప్పడు 4 వేలకు ఎందుకు పడిపోయాయని అధికారులను నిలదీసేందుకు వెళ్లారు. ఎవరూ లేకపోవడంతో కోపోద్రిక్తులై కార్యాలయంలో ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అక్కడ్నుంచి తెలంగాణ చౌరస్తాకు వచ్చి రాస్తారోకో నిర్వహించారు. వ్యాపారులతో చర్చించి ధరలు పెంచుతామని అధికారులు... హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.


ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఆరు వ్యవసాయ మార్కెట్లలో వేరుశనగకు గరిష్ఠంగా 7 వేల ధర ఉండగా... నాగర్‌కర్నూల్‌లో కనిష్ఠంగా 3 వేల 433 రూపాయలు పలికింది. దీంతో అక్కడి రైతులు సైతం కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. వ్యాపారులంతా కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగానే నాణ్యత పేరుతో ధరలు తగ్గిస్తున్నారని ఆరోపిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో వేరుశనగకి మంచి డిమాండ్ ఉన్నా వ్యాపారుల సరైన ధర ఇవ్వట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాధారణంగా సుమారు రెండున్నర లక్షల ఎకరాల్లో పల్లి సాగవుతుంది. ఈసారి సాగు 2లక్షల ఎకరాలకే పరిమితమైంది. కాని దిగుబడి, నాణ్యత బాగా రావడంతో వేరుశనగకు బహిరంగ విపణిలో మంచి ధరలు పలుకుతున్నాయి. డిమాండ్ ఉన్నా... తగిన ధర చెల్లింకపోవటంతో రైతులు ఆందోళన బాట పడుతున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తే మేలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story