BRS: మైనంపల్లి, తుమ్మలపై బీఆర్‌ఎస్‌లో చర్చోపచర్చలు

BRS: మైనంపల్లి, తుమ్మలపై బీఆర్‌ఎస్‌లో చర్చోపచర్చలు
హరీష్‌రావుపై తీవ్ర వ్యాఖ్యలతో మైనంపల్లిపై ఆగ్రహంగా అధిష్టానం; ఎటువంటి చర్య తీసుకోని తీరుపై చర్చ

మైనంపల్లి ఏం చెబుతారు? తుమ్మల ఏం చేస్తారు? ఇప్పుడిదే బీఆర్ఎస్‌లో హాట్‌ టాపిక్‌. బీఆర్‌ఎస్‌లోనే కాదు పొలిటికల్ పార్టీల్లో.. యావత్‌ తెలంగాణలోనే ఈ ఇద్దరు నేతల తదుపరి చర్యపై ఆసక్తి నెలకొంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇవాళ తన అనుచరులతో సమావేశం అవుతున్నారు. తన కొడుకుకు మెదక్‌ టికెట్ ఇవ్వాలంటూ.. హరీష్‌రావుపై మైనంపల్లి చేసిన తీవ్ర వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో.. అధిష్టానం ఈ అశంలో మైనంపల్లిపై ఆగ్రహంగా ఉంది. అయినా ఎటువంటి చర్య తీసుకోని తీరుపై చర్చ జరుగుతోంది.

మరి.. రెండు టికెట్లు ఇవ్వనందుకు మల్కాజ్‌గిరి టిక్కెట్టు వద్దంటారా? లేక సర్దుబాటుకొస్తారా? తిరుగుబాటు చేస్తారా? అనేది ఆసక్తిగా మారింది. ఒకవేళ మైనంపల్లి సర్దుబాటుకొస్తే కేసీఆర్‌ సరేనంటారా? ఇలా.. మైనంపల్లి ఎపిసోడ్‌లో ఎన్నో ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. అటు.. తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పాలేరు నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉపేంద్రరెడ్డిని బీఆర్ఎస్‌ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో.. తనకు టిక్కెట్టు నిరాకరణపై తుమ్మల తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేసి తీరుతానని ఈ మాజీ మంత్రి స్పష్టం చేశారు. నిన్న బీఆర్‌ఎస్ జెండా, కేసీఆర్‌ ఫోటో లేకుండానే ఖమ్మంలో తుమ్మల ర్యాలీ నిర్వహించారు. ఐతే.. ఇదే అదునుగా తుమ్మలకు కాంగ్రెస్‌ గాలం వేస్తోంది. పాలేరు టిక్కెట్టును ఆఫర్‌ చేస్తోంది. మరి.. తుమ్మల కాంగ్రెస్‌ నుంచా లేక ఇండిపెండెంటుగా పోటీ చేస్తారా? ఆయన ఇంకా ఎటూ తేల్చుకోలేదు. పాలేరు నుంచి పోటీ మాత్రం ఖాయమని తుమ్మల తెగేసి చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story