MLC: టీచర్ ఎమ్మెల్సీగా మల్క కొమురయ్య

తెలంగాణలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీగా బీజేపీ బలపరిచిన అభ్యర్థి మల్క కొమురయ్య భారీ విజయం నమోదు చేశారు. అయితే.. ఈ స్థానంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అసలు అభ్యర్థిని నిలపలేదు. పీఆర్టీయూ బలపరిచిన అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డిపై మల్క కొమురయ్య 5,777 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నా ప్రధానంగా బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్యకు పీఆర్టీయూ బలపరిచిన వంగ మహేందర్‌రెడ్డి గట్టి పోటీనిచ్చారు. ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన అభ్యర్థులను కూడా మల్క కొమురయ్య ఓడించి.. ఏకంగా 12,959 ఓట్లు సాధించారు. ఈ స్థానానికి మొత్తం 25,041 ఉపాధ్యాయుల ఓట్లు పోలవ్వగా.. వాటిలో 24,144 చెల్లుబాటయ్యాయి. 897 ఓట్లు చెల్లనివిగా అధికారులు గుర్తించారు. గెలుపు కోసం 12073 ఓట్ల కావాల్సి ఉండగా.. మల్క కొమరయ్యకు 12,959 ఓట్లు పోలవ్వగా మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఘన విజయం సాధించారు. పీఆర్టీయూ అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డికి 7182 ఓట్లు వచ్చాయి. అయితే.. ఈ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న రఘోత్తమ్ రెడ్డికి కేవలం 429 ఓట్లు మాత్రమే వచ్చాయి.
పక్కా వ్యూహంతో పట్టేసిన బీజేపీ
బీజేపీ అధిష్ఠానం ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించి అనుకున్న ఫలితం సాధించింది. మిగతావారికంటే ముందుగా జనవరిలోనే అభ్యర్థులను ప్రకటించింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమురయ్య బరిలోకి దింపింది. ఆయన విజయం కోసం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్, ఇతర నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఘన విజయం సాధించారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని గెలుస్తాం: బండి
తెలంగాణలో త్వరలో రామరాజ్యం రానుందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. తెలంగాణలోని కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ నుంచి బీజేపీ బలపరిచిన అభ్యర్థి మల్క కొమురయ్య విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని ప్రధాని మోదీకి అంకితం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో రామరాజ్యం, మోదీ రాజ్యం రానుందన్న బండి సంజయ్.. పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూడా బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com