Mallanna Sagar Reservoir: మల్లన్నసాగర్‌కి గోదావరి జలాలు.. జాతికి అంకితం చేసిన కేసీఆర్‌..

Mallanna Sagar Reservoir: మల్లన్నసాగర్‌కి గోదావరి జలాలు.. జాతికి అంకితం చేసిన కేసీఆర్‌..
Mallanna Sagar Reservoir: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం అయింది.

Mallanna Sagar Reservoir: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం అయింది. మల్లన్నసాగర్‌ జలాశయంలోకి గోదావరి జలాలను ఎత్తిపోస్తున్నారు. సొరంగ మార్గం ద్వారా భూగర్భంలో ఏర్పాటు చేసిన పంప్ హౌజ్ వద్దకు వెళ్లిన సీఎం కేసీఆర్‌.. స్వయంగా మోటార్ల స్విచ్‌ ఆన్‌ చేసి, ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఆసియాలోనే అతిపెద్ద సర్జ్‌పూల్‌ను ఇక్కడ నిర్మించారు ఇంజనీర్లు.

అంతకంటే ముందు మల్లన్నసాగర్‌ ప్రాజెక్టును విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు కేసీఆర్‌. జలాశయంలో గోదావరి జలాలకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేశారు. మల్లన్న సాగర్‌ జలాశయం పూర్తి సామర్థ్యం 50 టీఎంసీలు కాగా.. డెడ్‌ స్టోరేజ్‌ 10 టీఎంసీలుగా ఉంది. అంటే, తెలంగాణలో ఎస్సారెస్పీ తర్వాత అతిపెద్ద రిజర్వాయర్‌ మల్లన్నసాగరే. మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ కట్టను 440 మీటర్ల వెడల్పుతో, 60 మీటర్ల ఎత్తులో నిర్మించారు.

ఈ మహాసాగరం కట్ట పొడవు 22.4 కిలోమీటర్లు. ఈ కట్ట నిర్మాణం కోసం 14.36 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి వాడారు. ఇక 13 జిల్లాల్లో సాగునీటితోపాటు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు, దక్షిణ తెలంగాణకు గోదావరి నీటిని అందిస్తారు. ఓవరాల్‌గా ఆనకట్టకు ఐదు తూములు ఏర్పాటు చేశారు. ఈ తూముల ద్వారా కొండపోచమ్మ, గంధమల్ల రిజర్వాయర్‌కు, సింగూరు ప్రాజెక్టుకు, తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు, మిషన్‌ భగీరథకు నీటిని మళ్లిస్తారు.

హైదరాబాద్‌ తాగునీటి కోసం 30 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాల కోసం 16 టీఎంసీల నీటిని ఏడాది పొడవునా అందిస్తారు. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ చాలా ఎత్తులో ఉన్న కారణంగా.. మెదక్‌, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాలకు కేవలం గ్రావిటీ ద్వారా నీటిని పంపించొచ్చు. మల్లన్నసాగర్‌ కింద లక్షా పాతిక వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. మల్లన్నసాగర్‌లోని గోదావరి నీళ్లు గ్రావిటీ కాల్వల ద్వారా హల్దీ, మంజీరా నదులను దాటడం మరో విశేషం.

Tags

Read MoreRead Less
Next Story